చంద్రబాబు అరెస్టుపై తనయుడు నారా లోకేష్ ఎక్స్ వేదికగా తన భావోద్వేగాలను పంచుకున్నారు. తెలుగు ప్రజల అభ్యున్నతి కోసం మా నాన్న తన జీవితాన్ని ధారపోశారని, లక్షలాది మంది జీవితాలను మార్చడానికి అవిశ్రాంతంగా కృషి చేశారని గుర్తుచేశారు. మా నాన్నను అక్రమంగా అరెస్ట్ చేయడాన్ని చూస్తుంటే ఆగ్రహం కట్టలు తెంచుకుంటోందని, నా రక్తం మరుగుతోందంటూ లోకేష్ ట్వీట్ చేశారు. చంద్రబాబును ఇవాళ అక్రమంగా అరెస్ట్ చేసి జైల్లో పెట్టడంతో కన్నీళ్లతో తడసిన కళ్లతో, బాధతో బరువెక్కిన హృదయంతో ఇది రాస్తున్నానని ట్వీట్ చేశారు.
మా నాన్నకు విశ్రాంతి అంటే తెలియదు. ఆయన ఎన్నడూ కక్షాపూరిత రాజకీయాలు చేయలేదని, నిజాయితీతో రాజకీయాలు నడిపారని ఆయన అన్నారు. మా నాన్న నుంచి ప్రేరణ పొందుతూ పెరిగానని చెప్పుకొచ్చారు. మానాన్న అడుగు జాడలను అనుసరించినట్టు చెప్పారు. అమెరికాలో సౌకర్యవంతమైన ఉద్యోగం వదులుకుని వచ్చాను, అది కొంత కఠినమైన నిర్ణయం అయినప్పటికీ భారతదేశానికి తిరిగి వచ్చానన్నారు. మానాన్న చేయని నేరానికి అన్యాయంగా రిమాండ్ వేయడం చూస్తుంటే నా ఆగ్రహం కట్టలు తెంచుకుంటోందని, రక్తం మరిగిపోతోందని ట్వీట్ చేశారు.
రాజకీయ పగకు హద్దులు లేవా అని లోకేష్ ప్రశ్నించారు. మానాన్న ఎన్నడూ విధ్వంసకర రాజకీయాలు చేయలేదు. ప్రజల అభివృద్ధి, సంక్షేమం కోసం, ఉద్యోగ అవకాశాలు కల్పించడం కోసం కృషి చేశాడని లోకేష్ గుర్తుచేశారు.
ఇది ఒక నమ్మక ద్రోహం. మానాన్న పోరాట యోధుడు. అలాగే నేనుకూడా… ఏపీ ప్రజల కోసం అచంచలమైన సంకల్పంతో, మార్గనిర్దేశం చేస్తూ తిరుగులేని శక్తితో ఎదుగుతామని చెప్పుకొచ్చారు. ఇప్పుడు జరుగుతోన్న యుద్ధంలో తనతో అందరూ కలసి రావాలని లోకేష్ పిలుపునిచ్చారు.