విజయవాడలో రెండు రోజులుగా కురుస్తోన్న వర్షాలతో ఇంద్రకీలాద్రిపై దుర్గ గుడి కేశ ఖండన శాల వద్ద కొండ చరియలు విరిగిపడ్డాయి. కొండ చరియలు విరిగి పక్కనే ఉన్న జాతీయ రహదారిపై పడటంతో రాకపోకలు నిలిచిపోయాయి. వెంటనే అధికారులు ప్రత్యేక పొక్రెయినర్ తెప్పించి కొండ రాళ్లను తొలగించే పనులు చేపట్టారు. కొండ చరియలు తొలగించే పనులు చేట్టడంతో కేశ ఖండన శాల సమీపంలోని సబ్వేను కూడా మూసివేశారు.
కనకదుర్గమ్మ గుడికి వచ్చే భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు చేపట్టారు. భక్తులను మల్లిఖార్జున మండపం మెట్ల మార్గం వైపు మళ్లించారు. కొండ చరియలు విరిగి పడటంతో ఆరు ద్విచక్రవాహనాలు ధ్వంసం అయ్యాయి. కొండ చరియలు విరిగిపడే సమయంలో అక్కడ ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదమే తప్పింది. సాయంత్రానికి కొండ చరియలు తొలగించి ట్రాఫిక్ పునరుద్దరిస్తామని అధికారులు తెలిపారు.