టీడీపీ
అధినేత, మాజీ సీఎం చంద్రబాబుపై
జగన్
ప్రభుత్వం అక్రమకేసులు బనాయించి జైలుకు పంపిందంటూ ఆ పార్టీ నేతలు ఆందోళన వ్యక్తం
చేస్తున్నారు. రాష్ట్రవ్యాప్త బందుకు
పిలుపునివ్వడంతో ఉద్రిక్త వాతావరణం చోటుచేసుకుంది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా
నినాదాలు చేస్తూ రాస్తారోకోలు చేపట్టారు. కూడళ్ళ వద్ద టైర్లు కాల్చి వాహనాల
రాకపోకలు అడ్డుకుంటున్న టీడీపీ నేతలు, వైసీపీ పాలనను నిరసిస్తూ నినాదాలు
చేస్తున్నారు.
చంద్రబాబును రాజకీయంగా ఎదుర్కోలేకనే తప్పుడు కేసులతో అరెస్టు
చేశారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
టీడీపీ
బంద్ కు పిలుపునిచ్చిన నేపథ్యంలో ఆర్టీసీ బస్సులు డిపోలకే పరిమితం అయ్యాయి.
విద్యాసంస్థలకు యాజమాన్యాలు సెలవు ప్రకటించాయి.
బంద్
నేపథ్యంలో రాష్ట్ర పోలీసు శాఖ అప్రమత్తమైంది. సమస్మాత్మక ప్రాంతాల్లో భారీగా
పోలీసులు మోహరించారు. అన్ని జిల్లాల్లో సెక్షన్ 144 అమలు చేస్తున్నారు. ర్యాలీలు,
నిరసనలు చేపట్టకుండా చూడాలని ఎస్పీలకు డీఐజీ ఆదేశాలు జారీ చేశారు.
అనకాపల్లి, నర్సీపట్నంలో టీడీపీ నేతలను గృహ
నిర్బంధం చేసిన పోలీసులు మాజీమంత్రి బండారు సత్యనారాయణను హౌస్ అరెస్టు చేశారు.
విశాఖ
పోర్టు గెస్ట్‌హౌస్ లో గవర్నర్ ను టీడీపీ నేతల బృందం కలిసి చంద్రబాబు అరెస్టు
విషయాన్ని ప్రస్తావించారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు క్షీణించాయని, రాజకీయంగా
టీడీపీని దెబ్బకొట్టేందుకే చంద్రబాబును కేసులో ఇరికించారని ఫిర్యాదు చేశారు.
రాష్ట్రవ్యాప్తంగా
టీడీపీ ఆదరణ పెరిగిందని, సొంతంగా పోటీ చేస్తే 15 లోక్‌సభ సీట్లు వస్తాయని, జనసేనతో
పొత్తుతో వెళితే వైసీపీ చిరునామా గల్లంతు అవుతుందన్నారు. తనకు తెలియకుండా
చంద్రబాబు అరెస్టు జరిగినట్లు గవర్నర్ తమతో చెప్పారన్నారు. రాష్ట్రంలో పరిణామాలను
గవర్నర్ గమనిస్తున్నారన్నారు.
ఉమ్మడి
ప్రకాశం జిల్లా వ్యాప్తంగా తెలుగు తమ్ముళ్ళు నిరసన వ్యక్తం చేస్తున్నారు. రాజకీయ
కక్షతోనే తమ అధినేతను తప్పుడు కేసులో అరెస్టు చేశారని ఆగ్రహం వ్యక్తం
చేస్తున్నారు.
తిరువూరు
నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే నల్లగట్ల స్వామిదాస్ ను పోలీసులు అదుపులోకి తీసుకుని
స్టేషన్ కు తరలించారు.
విజయనగరం
జిల్లాలోనూ టీడీపీ నేతల నిరసనలు మిన్నంటాయి. చీపురుపల్లిలో టీడీపీ నేత కిమిడి
నాగార్జునని పోలీసులు గృహ నిర్బంధం చేయగా ఆయన తప్పించుకుని బయటకు వచ్చి ధర్నాలో
పాల్గొన్నారు.
ధర్మవరంలో
ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పరిటాల శ్రీరామ్‌ను హౌస్ అరెస్టు చేసేందుకు
పోలీసులు రాగా ఆయన తప్పించుకుని ఎన్టీఆర్ విగ్రహం వద్దకు వెళ్లారు. ప్రభుత్వానికి
వ్యతిరేకంగా నినాదాలు చేశారు. రోడ్డుపై బైఠాయించి నిరసన తెలపగా పోలీసులు అదుపులోకి
తీసుకున్నారు.
చంద్రబాబు
సొంత జిల్లా చిత్తూరులోనూ ఆందోళనలు కొనసాగుతున్నాయి.
ఏలూరు
జిల్లా వ్యాప్తంగా 30 పోలీస్ యాక్ట్ అమలులో ఉందని ఎస్పీ మేరీ ప్రశాంతి తెలిపారు.
జిల్లాలో ఎక్కడా నిరసనలు, బంద్, ధర్నాలకు అనుమతి లేదన్నారు. సాధారణ ప్రజల
రాకపోకలకు ఇబ్బంది కల్గిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.
శ్రీకాకుళం
జిల్లా టెక్కలిలో బంద్ కొనసాగుతోంది. టెక్కలిలో హైవేపై టీడీపీ నేతలు బైఠాయించి
నిరసనకు దిగారు. దీంతో జాతీయ రహదారిపై వాహనాలు పెద్దసంఖ్యలో నిలిచిపోయాయి.
చంద్రబాబు
అరెస్టును జనసేన కూడా తప్పుపడుతోంది.
రాజకీయ కక్షలతో రెండు రోజులుగా చంద్రబాబును తిప్పారని మండిపడ్డారు.
స్కిల్
డెవలప్మెంట్ కేసులో టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబుకు విజయవాడ ఏసీబీ కోర్టు
14 రోజుల జ్యూడిషియల్ రిమాండ్ విధించింది. దీంతో ఆయనను రాజమహేంద్రవరం కేంద్ర
కారాగారానికి తరలించారు. ఆయన హోదా, వయస్సు, ఆరోగ్యం దృష్ట్యా జైలులో ప్రత్యేక
వసతులు కల్పిస్తున్నారు.
చంద్రబాబు
బెయిల్ కు సంబంధించి రెండు పిటిషన్లను ఆయన తరఫు న్యాయవాదులు దాఖలు చేశారు. ఏసీబీ
కోర్టులో ఓ పిటిషన్ వేయగా హైకోర్టులో మరో వ్యాజ్యం దాఖలు చేశారు.