స్కిల్ స్కామ్లో అరెస్టై రాజమహేంద్రవరం కేంద్ర కారాగారంలో ఉన్న మాజీ సీఎం చంద్రబాబునాయుడుకు ప్రత్యేక వసతులు కల్పించాలని ఏసీబీ కోర్టు ఆదేశించింది. ఆయనకు ప్రాణహాని ఉన్నందున జైలులో ప్రత్యేక గది కేటాయించాలని, తగిన భద్రతా ఏర్పాట్లు కూడా చేయాలని ఏసీబీ కోర్టు న్యాయమూర్తి హిమబిందు ఆదేశించారు. జైల్లో చంద్రబాబుకు ప్రత్యేక వసతులు కల్పించేలా ఆదేశాలు ఇవ్వాలని, ఆయన తరపు న్యాయవాదులు వేసిన పిటిషన్ను విచారించిన కోర్టు, ప్రత్యేక వసతులు కల్పించాలని ఆదేశించింది.
రాజకీయ ప్రత్యర్థులు, మావోయిస్టుల నుంచి చంద్రబాబు ప్రాణాలకు ముప్పు ఉందని, అందుకే ఆయనకు కేంద్ర ప్రభుత్వం జడ్ ప్లస్ కేటగిరీ భద్రత కల్పించినట్టు ఆయన తరపు న్యాయవాదులు కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ఆయన అనారోగ్య కారణాలతో బాధపడుతున్నందున వైద్యులు సూచించిన ఆహారాన్ని ఇచ్చేలా ఆదేశించాలని పిటిషన్లో కోరారు. చంద్రబాబును హౌస్ అరెస్టులో ఉంచాలని వేసిన మరో పిటిషన్పై విచారణను కోర్టు సోమవారానికి వాయిదా వేసింది. స్కిల్ స్కామ్ కేసులో ఏసీబీ కోర్టు తీర్పును సవాల్ చేస్తూ ఇవాళ హైకోర్టులో పిటిషన్ వేసేందుకు చంద్రబాబు తరపు న్యాయవాదులు సిద్దమవుతున్నారు.