బీజేపీతో
పొత్తుపై జేడీఎస్ ముఖ్యనేత, మాజీ సీఎం కుమారస్వామి కీలక వ్యాఖ్యలు చేశారు. ఎన్డీయే
కూటమిలో చేరిక పై ఇంకా తుదినిర్ణయం తీసుకోలేదన్నారు. రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ను
ఓడించడమే జేడీఎస్ లక్ష్యమన్నారు. తమ పార్టీలో ఎలాంటి చీలిక లేదన్న కుమారస్వామి, తమ పార్టీ తరఫున గెలిచిన 19 మంది ఎమ్మెల్యేలు
ఒకే మాటపై ఉన్నారని స్పష్టం చేశారు.
బీజేపీతో
సీట్ల పంపకం గురించి మాట్లాడటం తొందరపాటు అవుతుందన్న కుమారస్వామి, కాంగ్రెస్
పాలనలోని అవినీతిని ఎండగట్టి, రాబోయే ఎన్నికల్లో ఆ పార్టీని ఓడించడమే తమ కర్తవ్యం
అన్నారు. పార్టీలో ఎలాంటి అంతర్గత విభేదాలు లేవని, ఒక వేళ ఎదైనా సమస్య ఉత్పన్నమైతే
పరిష్కరించుకునే సత్తా తమకు ఉందని ధీమా వ్యక్తం చేశారు.
ఎన్డీయేలో చేరికపై ఇంకా
తుది నిర్ణయం తీసుకోలేదని చర్చలు కొనసాగుతున్నాయని కుమారస్వామి చెప్పారు.
మాజీ
ప్రధాని దేవగౌడ నేతృత్వంలోని జేడీఎస్, ఎన్డీయేలో చేరేందుకు సుముఖంగా ఉందని బీజేపీ ముఖ్యనేత, కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి
యడ్యూరప్ప అన్నారు. మొత్తం 28 లోక్ సభ
సీట్లలో జేడీఎస్ నాలుగు స్థానాల్లో పోటీ చేసేందుకు అంగీకారం కుదిరిందని తెలిపింది.
జేడీఎస్
తీరుపై ముఖ్యమంత్రి సిద్దరామయ్య మండిపడ్డారు. బీజేపీకి ఆ పార్టీ బీ టీమ్ గా
మారిందని ఎద్దేవా చేశారు. పేరులో సెక్యూలర్ పెట్టుకుని మతతత్వ పార్టీతో
జతకట్టేందుకు సిద్ధమైందని తీవ్ర విమర్శలు చేశారు.