స్కిల్
డెవలప్మెంట్ కేసులో మాజీ సీఎం చంద్రబాబు నాయుడు అరెస్టుకు సంబంధించి విజయవాడ
ఏసీబీ కోర్టులో వాదనలు ముగిశాయి. న్యాయమూర్తి ఎదుట ఇరుపక్షాలు సుదీర్ఘ వాదనలు
వినిపించాయి. దీంతో కాసేపట్లో కోర్టు తీర్పు వెల్లడించనుంది.
ఈ
కేసులో 2021లో ఎఫ్ఐఆర్ నమోదైందని విచారించేందుకు చంద్రబాబును 15 రోజుల కస్టడీకి
ఇవ్వాలని సీఐడీ తరఫు న్యాయవాది కోరారు. 28 పేజీల రిమాండ్ రిపోర్టును కోర్టుకు సీఐడీ అందజేసింది.
సీఐడీ
తరఫున ఏజీ పొన్నవోలు సుధాకర్ రెడ్డి, న్యాయవాదుల వివేకాచారీ, వెంకటేశ్ హాజరయ్యారు.
చంద్రబాబు తరపున సుప్రీంకోర్టు న్యాయవాది సిద్ధార్థ లూద్రా వాదనలు వినిపించారు. చంద్రబాబు
కూడా తానే స్వయంగా వాదించారు.
స్కిల్
డెవలప్మెంట్ స్కాం రాజకీయ ప్రేరేపిత చర్య అని వాదించిన సిద్ధార్థ లూద్రా,
చంద్రబాబును కేసులో ఇరికించేందుకు ప్రయత్నం చేస్తోందన్నారు. చంద్రబాబు హక్కులకు
భంగం కలిగించేలా వ్యవహరించారని అరెస్టుకు అవసరమైన ప్రక్రియను పాటించలేదని
న్యాయమూర్తి దృష్టికి తీసుకెళ్ళారు.
లూద్రా
లేవనెత్తిన ప్రశ్నలకు సీఐడీ తరఫున ఏఏజీ సుధాకర్ రెడ్డి సమాధానమిచ్చారు.
చంద్రబాబుపై సీఐడీ 34 అభియోగాలు నమోదు చేసిందని, కుంభకోణంలో చంద్రబాబు పాత్ర
ఉందన్నారు. చంద్రబాబు లాయర్లు ఎంతసేపూ సాంకేతిక అంశాల గురించే మాట్లాడుతున్నారని,
అవినీతి చేయలేదని ఒక్క మాట కూడా చెప్పడం లేదన్నారు.
చంద్రబాబును
అరెస్టు చేయడానికి గవర్నర్ అనుమతి అవసరం
లేదని, స్పీకర్ కు సమాచారం ఇస్తే సరిపోతుందని, ఆ నియమాలను సీఐడీ పాటించిందన్నారు. అరెస్టైన
మూడు నెలలలోపు గవర్నర్ కు ఎప్పుడైనా సమాచారం అందజేసే సౌలభ్యం ఉందన్నారు.
తీవ్రమైన
ఆర్థిక నేరాలకు పాల్పడిన వారిని ఎలాంటి నోటీసు ఇవ్వకుండానే అరెస్టు చేయవచ్చు అని
చెప్పారు. ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబు నిధుల విడుదలకు ఆదేశించారని అందుకు సంబంధించిన
ఆధారాలు తమ వద్ద ఉన్నాయని కోర్టు దృష్టికి తీసుకెళ్ళారు.
సెక్షన్ 409 పూర్తిగా
వర్తిస్తుందని చంద్రబాబుకు రిమాండ్ విధించాలని కోరారు.
ఏసీబీ
కోర్టులో చంద్రబాబు తరఫు న్యాయవాది లూథ్రా,
చంద్రబాబుకు రిమాండ్ విధిస్తే బెయిల్ అప్లికేషన్ ను పరిగణనలోకి తీసుకోవాలని కోరారు . దీనిపై న్యాయస్థానం ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. నంద్యాలలో కోర్టు ఉండగా
చంద్రబాబును విజయవాడ ఎందుకు తీసుకువచ్చారని కొత్త వాదన లేవనెత్తారు.