రెండు రోజులపాటు ఢిల్లీలో జరిగిన జీ20 సమావేశాలు ముగిశాయి. జీ20 అధ్యక్ష పదవిని లాంఛనంగా బ్రెజిల్‌కు బదిలీ చేస్తూ ప్రధాని మోదీ, బ్రెజిల్ అధ్యక్షుడు లూయిజ్ ఇనాసియో లులా డా సిల్వాకు గవెల్‌ను అందించారు. రెండు రోజుల పాటు జరిగిన జీ20 సమావేశాల్లో అనేక అంశాలపై సభ్య దేశాలు ఏకాభిప్రాయానికి వచ్చాయి. ఈ సమావేశాల్లో ఢిల్లీ డిక్లరేషన్ ఏకగ్రీవంగా ఆమోదం పొందడం ఘన విజయంగా చెప్పవచ్చు.
ఒక భూమి, ఒక కుటుంబం నినాదంతో విస్తృత చర్చలు జరిపారు. ఒక భూమి, ఒక కుటుంబం అనే ఆశావాద ప్రయత్నాలకు జీ20 వేదికగా మారిందని ప్రధాని మోదీ ముగింపు ప్రసంగంలో అన్నారు. సామాజిక కలయిక, ఆకలికి వ్యతిరేకంగా పోరాటం, ఇంధన వినియోగం, స్థిరమైన అభివృద్ధిలాంటి ప్రధాన అంశాలను జీ20లో ముఖ్యంగా చర్చించారు.
అభివృద్ధి చెందుతోన్న దేశాలు రాజకీయంగా బలోపేతం కావాలంటే ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో శాశ్వత సభ్యులుగా ఉండాల్సిన అవసరం ఉందని ప్రధాని మోదీ గుర్తుచేశారు. ప్రపంచ బ్యాంకు, ఐఎంఎఫ్‌లో కూడా వర్థమాన దేశాలకు అధిక ప్రాధాన్యత కావాలని కోరుకుంటున్నట్టు ప్రధాని మోదీ తెలిపారు.
ఈ సమావేశాల్లో గ్లోబల్ ట్రస్ట్ డెఫిసిట్, గ్లోబల్ బయో ఫ్యూయల్ అలయన్స్ ఏర్పాటుతోపాటు, అమెరికా, ఇండియా, సౌదీ అరేబియా, గల్ఫ్ దేశాల మధ్య నెట్వర్క్ పెంచేందుకు జీ20 సమ్మిట్ నిర్ణయాలు తీసుకుంది.
శాంతి, స్థిరత్వం కాపాడుకుంటూ ప్రాదేశిక సమగ్రతను గౌరవించే అంతర్జాతీయ మానవతా చట్టాలను సమర్ధించాలన్న ఢిల్లీ డిక్లరేషన్‌ను జీ20దేశాలు ఏకగ్రీవంగా ఆమోదించాయి. బలవంతంగా దేశాల భూభాగాలను ఆక్రమించుకోవడాన్నిఢిల్లీ డిక్లరేషన్ వ్యతిరేకించింది. ఇందుకు చైనా, రష్యా కూడా అంగీకరించాయి.
2030నాటికి పునరుత్పాదక ఇంధన సామర్ధ్యాన్ని మూడు రెట్లు పెంచాలని, బొగ్గు వినియోగం దశల వారీగా తగ్గించే ప్రయత్నాలను వేగవంతం చేయాలని జీ20 దేశాలు నిర్ణయించాయి. అయితే చమురు, గ్యాస్ వినియోగం తగ్గించే విషయాలపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు.