జీ-20
సదస్సు సందర్భంగా భారత్ పర్యటనకు వచ్చిన బ్రిటన్ ప్రధాని రిషి సునాక్, ఆయన సతీమణి
అక్షతామూర్తి అక్షరధామ్ ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. బ్రిటన్
ప్రధాని రాక సందర్భంగా ఆలయ పరిసరాల్లో దిల్లీ పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాట్లు
చేశారు.
రిషి
సునాక్ బ్రిటన్ ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారి భారత్ పర్యటనకు
వచ్చారు. జీ-20 సదస్సులో పాల్గొని కీలక ప్రసంగాలు చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ
సహా ఇతర దేశాల నేతలతో ద్వైపాక్షిక సమావేశాల్లో పాల్గొన్నారు.
సాదాసీదా
వస్త్రధారణలో ఆలయానికి వచ్చిన సునాక్ దంపతులకు ఆలయ సిబ్బంది సాంప్రదాయబద్దంగా
స్వాగతం పలికారు. సుమారు గంటపాటు ఆలయంలోనే గడిపారు.
ఆలయాన్ని సందర్శించనున్నట్లు శనివారం సాయంత్రమే
వెల్లడించారు. హిందువుగా తాను గర్విస్తున్నానని ఆ సంస్కృతిలోనే తాను పెరిగినట్లు
తెలిపారు. తన విశ్వాసాలే ఒత్తిడి సమయంలో తనకు సాంత్వననిస్తాయని వివరించారు. ఇటీవలే
రక్షాబందన్ పండుగను జరుపుకున్నట్లు తెలిపారు. తన చెల్లితో పాటు సమీప బంధువులు రాఖీ
కట్టినట్లు చెప్పారు. శ్రీకృష్ణుడి జన్మాష్టమి జరుపుకునేందుకు సమయం దొరకలేదన్నారు.
ఆలయ
దర్శనం తర్వాత సునాక్ మహాత్మాగాంధీ స్మారకం రాజ్‌ఘాట్ కు చేరుకున్నారు. అక్కడ
ఆయనకు ప్రధాని మోదీ స్వాగతం పలికారు. జీ20 సదస్సు నిమిత్తం భారత్ కు చేరుకున్న
దేశాధినేతలందిరితో కలిసి సునాక్, మహాత్ముడికి నివాళులర్పించారు.
జీ-20
సదస్సు సందర్భంగా ప్రధాని నరేంద్రమోదీతో రిషి సునాక్ సమావేశమయ్యారు. భారత్,
బ్రిటన్ మధ్య ‘స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం’ కుదుర్చుకోవాలని ఇరువురు నిర్ణయించారు.