జీ20లో ఢిల్లీ డిక్లరేషన్ ఆమోదం వెనుక భారీ కసరత్తే జరిగింది. జీ20 దేశాల మధ్య ఏకాభిప్రాయ సాధనకు భారత దౌత్యవేత్తల బృందం చేసిన కృషిని ప్రధాని మోదీ అభినందించారు. ఢిల్లీ డిక్లరేషన్ రూపొందించడం, ఆమోదం కోసం 200 గంటల పాటు నిరంతర చర్చలు జరిపినట్టు జీ20 సంప్రదింపుల ఛైర్మన్ అమితాబ్ కాంత్ వెల్లడించారు. 300 ద్వైపాక్షిక సమావేశాలు నిర్వహించారు. ఉక్రెయిన్ యుద్ధం నేపధ్యంలో జీ20 దేశాల ప్రతినిధులతో 15 ముసాయిదాలపై చర్చించారు. వీరందరి కృషి వల్లే జీ20లో ఢిల్లీ డిక్లరేషన్‌కు ఏకాభిప్రాయ ఆమోదం లభించింది.
రష్యా ఉక్రెయిన్ యుధ్దం నేపధ్యంలో భౌగోళిక రాజకీయ అంశాలపై జీ20లో ఏకాభిప్రాయం తీసుకువచ్చేందుకు 200 గంటల నిరంతర చర్చలు, 300 సమావేశాలు, 15 ముసాయిదాల వల్లే సాధ్యమైందని అమితాబ్ కాంత్ తెలిపారు.
ఢిల్లీ డిక్లరేషన్ విషయంలో భారత్ అతిపెద్ద విజయం సాధించినట్టైంది. జీ20 దేశాల ప్రతినిధుల మధ్య కొంత విభేదాలు ఉన్నా ఈ విషయంలో ఏకాభిప్రాయం సాధ్యమైంది. ఉక్రెయిన్ యుద్ధం అంశంలో చాలా నేర్పుగా వ్యవహరించారు. అన్ని దేశాల మద్దతు లభించేలా పలు సవరణలు చేశారు. ఢిల్లీ డిక్లరేషన్ ఏకాభిప్రాయం సాధించడానికి నిరంతరం కృషి చేసిన బృందాన్ని ప్రధాని మోదీ అభినందించారు.