స్కిల్
డెవలప్మెంట్ కేసులో అరెస్టైన టీడీపీ అధినేత చంద్రబాబును కలిసేందుకు వచ్చిన జనసేన
అధినేత వపన్ కళ్యాణ్ ను ఏపీ పోలీసులు రాష్ట్ర సరిహద్దులో అడ్డుకున్నారు. హైదరాబాద్
నుంచి గన్నవరం వరకు విమానంలో వచ్చేందుకు ప్రయత్నించగా అనుమతి లభించలేదు. దీంతో ఆయన
రోడ్డు మార్గాన విజయవాడ వస్తుండగా, ఏపీ బోర్డర్లో పోలీసులు అడ్డుకున్నారు.
జగ్గయ్యపేట మండలంలో పలుమార్లు తనను అడ్డుకోవడంతో పవన్, అనుమంతిపల్లి నుంచి
కాలినడకన మంగళగిరి బయల్దేరారు. అయినప్పటికీ పోలీసులు అభ్యంతరం వ్యక్తం చేయడంతో
రోడ్డుపై పడుకుని నిరసన తెలిపారు.
పవన్
కళ్యాణ్, నాదెండ్ల మనోహర్ అదుపులోకి తీసుకుని అక్కడ్నించి తరలించారు. జనసేనాని వాహనాన్ని
ఆయన అభిమానులు అనుకరించారు. పోలీసులు వారిద్దరినీ మంగళగిరి జనసేన కార్యాలయం వద్ద
విడిచిపెట్టారు.
టీడీపీ
అధినేత చంద్రబాబు అరెస్టుపై ఆ పార్టీ కార్యకర్తలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం
చేస్తున్నారు. పెద్దసంఖ్యలో రోడ్లపైకి వచ్చి నిరసన తెలుపుతున్నారు. ప్రభుత్వానికి
వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ రాస్తారోకోలు చేపట్టారు.
టీడీపీ
ఎమ్మెల్యేలు, ఎంపీలను పోలీసులు ముందుస్తుగా గృహనిర్బంధం చేశారు.
టీడీపీ
రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడిని విశాఖలో గృహ నిర్బంధం చేయగా, మాజీమంత్రి
అయ్యన్న పాత్రుడిని, నర్సీపట్నంలో ఆయన ఇంటి నుంచి బయటకు రాకుండా పోలీసులు
అడ్డుకున్నారు. రాజమహేంద్రవరం ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్యచౌదరి బయటకు వచ్చేందుకు
ప్రయత్నించగా పోలీసులు వెనక్కి నెట్టారు. దీంతో ఉద్రిక్తత చోటుచేసుకుంది.
విజయవాడలో
టీడీపీ నేతలు, కార్యకర్తలు చేపట్టిన నిరసన కార్యక్రమంలో మాజీమంత్రి కొల్లు
రవీంద్ర, జడ్పీ గద్దె అనురాధ పాల్గొన్నారు. కొల్లు రవీంద్రను అరెస్టు చేసి గుణదల
పోలీస్ స్టేషన్ కు తరలించారు. మాజీమంత్రి దేవినేని ఉమామహేశ్వరరావును పోలీసుల
అదుపులోకి తీసుకుని భవానీపురం స్టేషన్ కు తరలించారు.