జీ20 దేశాధినేతలు రెండో రోజు సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు. ఇప్పటికే జీ20 ఢిల్లీ డిక్లరేషన్‌ను ఏకగ్రీవంగా ఆమోదించింది. దేశాల ప్రాదేశిక సమగ్రతను అందరూ గౌరవించాలని జీ20 పిలుపునిచ్చింది. ప్రపంచ దేశాల మధ్య నమ్మకాన్ని పెంచడం, వాతావరణ మార్పులు, ఆర్థిక సమస్యల పరిష్కారాలపై ఇవాళ జీ20లో చర్చలు జరగనున్నాయి.
జీ20లో మొదటి రోజు అనేక కీలక అంశాలపై చర్చలు సాగాయి. గ్లోబల్ డ్రస్ట్ డెఫిసిట్, గ్లోబల్ బయో ఫ్యూయల్ కూటమి ఏర్పాటు, అమెరికా, ఇండియా, సౌదీ అరేబియా, గల్ఫ్ దేశాల మధ్య కొత్తగా నెట్‌వర్క్ ఏర్పాటు చేసుకోవాలని నిర్ణయించారు. శాంతి, స్థిరత్వాన్ని కాపాడేందుకు కూటమిలోని దేశాలు ప్రాదేశిక సమగ్రత, అంతర్జాతీయ మానవతా చట్టాలను గౌరవించాలని ఢిల్లీ డిక్లరేషన్‌లో జీ20 దేశాలు ఏకగ్రీవంగా ఆమోదించాయి. ఢిల్లీ డిక్లరేషన్‌కు చైనా, రష్యా దేశాలు కూడా అమోదం తెలిపాయి.
భూ భాగాలను ఆక్రమించుకోవడానికి బల ప్రయోగం చేయవద్దని ఢిల్లీ డిక్లరేషన్ అన్ని దేశాలకు పిలుపునిచ్చింది. ఉక్రెయిన్‌తో రష్యా యుద్ధం చేయడాన్ని జీ20 తప్పుపట్టింది. 2030 నాటికి ప్రపంచ పునరుత్పాదక ఇంధన సామర్థ్యాన్ని మూడు రెట్లు పెంచాలని, బొగ్గు వినియోగం దశల వారీగా తగ్గించాలని జీ20 దేశాలు నిర్ణయించాయి. అయితే చమురు, గ్యాస్ వినియోగం తగ్గించే విషయంలో మాత్రం జీ20 ఎలాంటి నిర్ణయం ప్రకటించలేదు.
ప్రపంచ జీడీపీలో జీ20 దేశాలు 85 శాతం కలిగి ఉన్నాయి. ఈ దేశాలు మొత్తం కాలుష్యంలో 80 శాతం విడుదల చేస్తున్నాయి. శిలాజ ఇంధన వినియోగం తగ్గించడానికి, వాటిపై రాయితీలు తొలగించడం, హేతుబద్దీకరించడానికి 2009లో పిట్స్‌బర్గ్‌లో ఇచ్చిన వాగ్దానాన్ని నిలబెట్టుకుంటామని జీ20 దేశాలు అభిప్రాయపడ్డాయి.
రెండో రోజుల జీ20 దేశాల ప్రతినిధులు ఢిల్లీలోని మహాత్మాగాంధీ స్మారక రాజ్‌ఘాట్‌ను సందర్శించి నివాళులర్పించారు.