జీ20 సమావేశాల్లో ఇవాళ కీలక ఆమోదం లభించింది. వాతావరణ మార్పులు, ఉక్రెయిన్ ఘర్షణలకు సంబంధించిన పలు అంశాలతో కూడిన ఢిల్లీ డిక్లరేషన్‌కు చైనా, రష్యా సహా జీ20 దేశాల కూటమి ఆమోదం లభించింది. ఢిల్లీ డిక్లరేషన్‌ను ఆమోదించడంపై ప్రధాని మోదీ ఆనందం వ్యక్తం చేశారు. జీ20 డిక్లరేషన్ తయారు చేయడం, సభ్య దేశాల ఆమోదం లభించేలా చేయడంలో మన బృందం పడిన కష్టం ఫలించిందని మోదీ కితాబిచ్చారు.
యావత్ ప్రపంచానికి నూతన మార్గం చూపగల శక్తి 21వ శతాబ్దానికి ఉందని ప్రధాని మోదీ ఆకాంక్షించారు. శతాబ్దాల నాటి సమస్యల పరిష్కారానికి నూతన పరిష్కారాలు కనుగొనాల్సిన సమయం ఆసన్నమైందని ఆయన అన్నారు. మానవతా కోణంలో మన బాధ్యతలను నెరవేర్చుకోవాలని మోదీ స్పష్టం చేశారు.
న్యూ ఢిల్లీ డిక్లరేషన్ ప్రధానంగా బలమైన, స్థిరమైన, సమతుల్య, సమ్మిళతమైన వృద్ధిపై దృష్టి సారించినట్టు జీ20 సంప్రదింపుల ఛైర్మన్ అమితాబ్ కాంత్ పేర్కొన్నారు. ఢిల్లీ డిక్లరేషన్‌కు ఆమోదం తెలిపినందుకు ఆయన సభ్య దేశాలకు ధన్యవాదాలు తెలిపారు.
జీ20 సమావేశాల ద్వారా ఆహార భద్రత, పోషకాహారం విషయంలోనే కాకుండా, బ్లూ ఓషన్ ఎకానమీ, గోవాలో పర్యాటకం అభివృద్ధి, భూ పరిరక్షణతోపాటు చిన్న పరిశ్రమలకు సులువుగా సమాచార పంపిణీ జరగనుందని అధికార వర్గాల ద్వారా తెలుస్తోంది. అనేక దేశాలను కలుపుకునిపోవడంతో ప్రజా జీ20గా మారిందని, కోట్లాది ప్రజలకు అనుబంధం ఏర్పడిందని ప్రధాని మోదీ అన్నారు. కోవిడ్ మహమ్మారి తరవాత ప్రపంచ దేశాల మధ్య అపనమ్మకం పెరిగిపోయిందంటూ, ఉక్రెయిన్, రష్యా మధ్య జరుగుతున్న యుద్ధాన్ని మోదీ ప్రస్తావించారు. జీ20లో శాశ్వత సభ్యులుగా చేరినందుకు ఆఫ్రికన్ యూనియన్‌కు మోదీ ధన్యవాదాలు తెలిపారు.