జి-20 సమావేశాల సందడి శుక్రవారం నుంచే మొదలైంది.
ఇవాళ, రేపు జరగనున్న సమావేశాలతో ఈ సదస్సు ముగుస్తుంది. ఈ సమావేశాల కోసం భారత్
వచ్చిన పలువురు విదేశీ నేతలతో భారత ప్రధానమంత్రి ప్రత్యక్షంగా ద్వైపాక్షిక చర్చలు జరిపారు.
నరేంద్ర మోదీ మొట్టమొదటగా మారిషస్ ప్రధానమంత్రి
ప్రవింద్ జగ్‌నాథ్‌తో శుక్రవారం సాయంత్రం భేటీ అయారు. మారిషస్ ఆర్థిక వ్యవస్థకు
భారత్ అందిస్తున్న సహకారానికి ప్రవింద్ ధన్యవాదాలు తెలియజేసారు. మారిషస్‌తో సమగ్ర
ఆర్థిక భాగస్వామ్య ఒప్పందం కుదుర్చుకున్న మొట్టమొదటి దేశం భారతదేశమే. భారత్ తమ
దేశానికి ఎంత ప్రాధాన్యతనిస్తోందో ఆ ఒప్పందం ద్వారా తెలిసిందంటూ ప్రవింద్ హర్షం
వ్యక్తం చేసారు.
ఆ తర్వాత భారత ప్రధానమంత్రి బంగ్లాదేశ్
ప్రధానమంత్రి షేక్ హసీనాతో సమావేశమయ్యారు. వారిద్దరి ద్వైపాక్షిక సమావేశం అనంతరం
ఇరుదేశాలూ మూడు అవగాహనా ఒప్పందాలపై సంతకాలు చేసాయి. డిజిటల్ పేమెంట్ మెకానిజంలో
సహకారం కోసం నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్
ఆఫ్ ఇండియా, బంగ్లాదేశ్ బ్యాంక్‌లు ఎంఓయూ కుదుర్చుకున్నాయి. రెండవది, ఇరు దేశాల
మధ్యా కల్చరల్ ఎక్స్ఛేంజ్ ప్రోగ్రామ్‌ను మరో రెండేళ్ళు పొడిగించే ఒప్పందం మీద ఇరు
దేశాల ప్రతినిథులూ సంతకాలు చేసారు. ఇక మూడవ ఒప్పందం వ్యవసాయ రంగానికి
సంబంధించినది. వ్యవసాయ పరిశోధనల్లో పరస్పర సహాయం కోసం — భారత వ్యవసాయ పరిశోధనా
సంస్థ ఇకార్, బంగ్లాదేశ్ వ్యవసాయ పరిశోధనా సంస్థ బార్క్ – ఒప్పందాలు కుదుర్చుకున్నాయి.
ఇద్దరు ప్రధానమంత్రులూ రాజకీయ, భద్రతా సహకారం, సరిహద్దుల నిర్వహణ, వాణిజ్యం,
కనెక్టివిటీ, జల వనరులు, విద్యుత్తు, ఇంధనం, తదితర అంశాల పైన కూడా చర్చలు
సాగించారు.
ఆ తర్వాత మోదీ, అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌తో
భేటీ అయ్యారు. ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో భారత్‌కు శాశ్వత సభ్యత్వం ఇచ్చేందుకు
అమెరికా సహకరిస్తుందని బైడెన్ మోదీకి వెల్లడించారు. అలాగే, 2028-29 సంవత్సరంలో
భద్రతా మండలిలో తాత్కాలిక సభ్యత్వం కోసం భారత్ చేస్తున్న ప్రయత్నాలకు సైతం మద్దతిస్తామని
ప్రకటించారు. ఆ విషయాన్ని వైట్‌హౌస్ ఒక ప్రకటనలో పేర్కొంది. ఇద్దరు దేశాధినేతలూ
ద్వైపాక్షిక సంబంధాలను మరింత ముందుకు తీసుకువెళ్ళే విధంగా చర్చలు జరిపారు.
భారత్-అమెరికా మధ్య స్నేహబంధం ప్రపంచానికి మేలు చేసే దిశగా కొనసాగుతుందని మోదీ
వ్యాఖ్యానించారు.
ఇక ఈ ఉదయం నరేంద్ర మోదీ, ఇంగ్లండ్ ప్రధానమంత్రి రిషి
శునక్‌తో ద్వైపాక్షిక చర్చల్లో పాల్గొన్నారు. ఇరు దేశాల మధ్యా స్వేచ్ఛా వాణిజ్య
ఒప్పందం, సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని బలోపేతం చేయడం వంటి అంశాలపై ఇద్దరు
నేతలూ చర్చించారు. ప్రపంచం ఎన్నో సవాళ్ళను ఎదుర్కొంటున్న ప్రస్తుత తరుణంలో జి-20
కూటమి ఆ సమస్యలకు పరిష్కారాలు చూపించగలదని రిషి శునక్ ఆశాభావం వ్యక్తం చేసారు.