ఆఫ్రికా
దేశమైన మొరాకోలో భూకంప మృతుల సంఖ్య 820 కి చేరింది. మరో 672 మంది తీవ్రంగా
గాయపడ్డారని ఆ దేశ అధికార వర్గాలు తెలిపాయి.
పర్యాటక
ప్రాంతమైన మరాకేశ్‌కు నైరుతి దిశగా 71కిలోమీటర్లు దూరంలో శుక్రవారం రాత్రి భూమి కంపించింది.
భూకంప లేఖినిపై తీవ్రత 6.8గా నమోదైంది.
అల్‌హౌజ్,
మరాకేశ్, క్వార్జాజేట్, అజిలాల్ సహా పలు
ప్రాంతాలు ఈ భూకంప ధాటికి వణికిపోయాయి. భవనాలు కూలిపోయాయి. ప్రకంపనలతో స్థానికులు
నివాసాల నుంచి బయటికి పరుగులు పెట్టారు. ఎప్పుడు ఏ భవనం కూలుతుందో తెలియక
రోడ్డుపైనే జాగారం చేస్తున్నారు. ప్రస్తుతం సహాయ చర్యలు కొనసాగుతున్నాయి. గాయపడిన
వారితో సమీప ఆస్పత్రులు కిక్కిరిసి పోయాయి. మొరాకో గతంలో ఎన్నడూ ఈ స్థాయి
భూకంపాన్ని చూడలేదు.
ఈ ప్రకంపనల ప్రభావం పొరుగున ఉన్న అల్జీరియాలో కనిపించింది.
అక్కడ ప్రాణ, ఆస్తి నష్టం జరగలేదు.
1980లో
అల్జీరియాలో 7.3 తీవ్రతతో తీవ్ర భూకంపం సంభవించింది. ఆ దుర్ఘటనలో 2,500 మంది
మరణించగా, 3 లక్షల మంది నిరాశ్రయులుగా మారారు. ఈ ఏడాది తుర్కియే ప్రకృతి ప్రకోపానికి
గురైంది. దీంతో వేల మంది మరణించారు.
మొరాకోలో
భూకంపంపై ప్రధాని మోదీ స్పందించారు. వందల సంఖ్యలో ప్రజలు ప్రాణాలు కోల్పోవడంపై
ప్రధాని మోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. క్లిష్ట సమయంలో మొరాకో
ప్రభుత్వంతో కలిసి పనిచేయడానికి భారత ప్రభుత్వం సిద్ధంగా ఉందని ప్రకటించారు. మొరాకోకు
సమష్టిగా సాయం చేయాలని జీ-20 ప్రారంభోపన్యాసంలో మోదీ పిలుపునిచ్చారు.