టీడీపీ
అధినేత చంద్రబాబు అరెస్టుపై ఆయన భార్య భువనేశ్వరి స్పందించారు. తన భర్తను అరెస్టు
చేయడం పట్ల తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. హైదరాబాద్ నుంచి విజయవాడ చేరుకున్న
భువనేశ్వరి, ఇంద్రకీలాద్రిపై అమ్మవారిని దర్శించుకున్నారు.
సోదరుడు
రామకృష్ణతో కలిసి మీడియాతో మాట్లాడిన భువనేశ్వరి.. ఒక బిడ్డకు మనస్సు
బాగోలేనప్పుడు తల్లిదండ్రుల వద్దకు వెళ్తాడు, అందుకే కనకదుర్గమ్మకు నా బాధను చెప్పుకోవడానికి
ఆమె ఆశీర్వచనం తీసుకోవడానికి వచ్చానన్నారు.
చంద్రబాబును
రక్షించమని, ఆయనకు మనోధైర్యం ప్రసాదించమని అమ్మవారిని కోరినట్లు తెలిపారు.
చంద్రబాబు పోరాటం చేస్తున్నది ఆయన కుటుంబం కోసం కాదని, రాష్ట్ర ప్రజలందరి కోసమని..
చంద్రబాబు చేస్తున్న పోరాటం దిగ్విజయం కావడానికి అందరూ చేతులు కలపాలని కోరారు. జై
దుర్గాదేవి, జైహింద్, జై అమరావతి అని నినదించి
సమావేశాన్ని ముగించారు.
చంద్రబాబు
అరెస్టు పై జనసేన అధినేత పవన్ స్పందించారు. ప్రాథమిక ఆధారాలు చూపకుండా అరెస్టు
చేసే విధానాన్ని రాష్ట్రంలోనే అవలంభిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గత ఏడాది
విశాఖపట్నంలో జనసేన కేడర్ పై పోలీసు వ్యవస్థ ఎలా వ్యవహరించిందో అందరూ చూశారన్న
పవన్, ఏ తప్పు చేయని జనసేన కార్యకర్తలను జైల్లో పెట్టారని, ఇప్పుడు నంద్యాలలో
చంద్రబాబు అరెస్టు ఘటన కూడా అలాంటిదేనని విమర్శించారు. చంద్రబాబు అరెస్టును జనసేన
సంపూర్ణంగా ఖండిస్తోందన్నారు. వైసీపీ
రాజకీయ కక్ష సాధింపు అంశంగానే జనసేన చూస్తోందన్నారు.
మాజీ
సీఎం చంద్రబాబు అరెస్టు అక్రమం, చట్ట విరుద్ధమని సీబీఐ మాజీ డైరెక్టర్
నాగేశ్వరరావు అన్నారు. గవర్నర్ అనుమతి లేకుండా చంద్రబాబును అరెస్టు చేయడం,
దర్యాప్తు చేపట్టడం చట్టవిరుద్ధమన్నారు. అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్ 17ఎ(సి)
ప్రకారం గవర్నర్ అనుమతి తప్పనిసరని వెల్లడించారు. ఒక వేళ అనమతిస్తే అరెస్టు సమయంలో
సంబంధిత పత్రాలు చూపాలన్నారు. ఎలాంటి అనుమతి లేకుండా అరెస్టు చేస్తే అక్రమ
నిర్బంధం అవుతుందన్నారు. సదరు అధికారులపై చర్యలు ఉంటాయన్నారు.
మాజీ ముఖ్యమంత్రి, ప్రధాన ప్రతిపక్షనేతగా ఉన్న చంద్రబాబు జిల్లా పర్యటనలో ఉన్నప్పుడు అరెస్టు చేసిన తీరు తీవ్ర
అభ్యంతరకరమని సీపీఎం రాష్ట్రకార్యదర్శి శ్రీనివాసరావు అన్నారు. చంద్రబాబును
తక్షణమే విడిచిపెట్టి స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లో జరిగిన అవినీతి ఆరోపణలపై
నిష్పక్షపాతంగా, చట్టబద్దంగా విచారణ జరపాలని డిమాండ్ చేశారు. చందబ్రాబు
అరెస్టును నిరసిస్తూ ఆందోళనకు దిగిన టిడిపి కార్యకర్తలను రాష్ట్రవ్యాపితంగా గృహ
నిర్బంధం చేయడం, ఆయన కుమారుడు లోకేష్‌ను
అనుమతించకపోవడం అప్రజాస్వామికమని పేర్కొన్నారు.