దేశ వ్యాప్తంగా ప్రకంపనలు సృష్టించిన ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటోన్న వైసీపీ ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి అప్రూవర్‌గా మారారు. ఇప్పటికే ఈ కేసులో ఉన్న ఎంపీ తనయుడు మాగుంట రాఘవరెడ్డి అప్రూవర్‌గా మారిన సంగతి తెలిసిందే. శుక్రవారం సాయంత్రం ఈ కేసుకు సంబంధించిన కీలక సమాచారాన్ని మాగుంట శ్రీనివాసులరెడ్డి ఢిల్లీలో ఈడీకి అందించినట్లు తెలుస్తోంది.
ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో సౌత్ గ్రూప్‌పై తీవ్ర ఆరోపణలు వచ్చాయి. ఈ గ్రూపునకు చెందిన మాగుంట శ్రీనివాసులరెడ్డి, రాఘవరెడ్డి కీలకంగా వ్యవహరించారు. వీరు ఇద్దరూ అప్రూవర్లుగా మారడంతో కేసు కీలక మలుపు తీసుకుంది. ఈ కేసులో వేగం పెంచిన ఈడీ అధికారులు హైదరాబాద్ నుంచి దేశంలోని వివిధ ప్రాంతాలను నగదు బదిలీ అయినట్టు గుర్తించారు. నగదు ఎవరెవరి ఖాతాలకు బదిలీ అయిందనే విషయాన్ని ఈడీ అధికారులు సేకరిస్తున్నారు.
ఢిల్లీ లిక్కరు స్కామ్‌లో అప్రూవర్లుగా మారిన వారిలో ఎక్కువగా సౌత్ గ్రూప్ వారే ఉన్నారు. ఇండో స్పిరిట్ కంపెనీలో ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి సింహ భాగం కలిగి ఉన్నారు. అయితే అప్రూవర్‌గా మారిన మాగుంట ఈడీకి ఎలాంటి సమాచారం ఇచ్చారనేది ఆసక్తిగా మారింది.