ఢిల్లీలో జీ20 సమావేశాలు పారంభమైన వేళ ముగిసిన వారాంతానికి భారత స్టాక్ మార్కెట్ల విలువ 300 లక్షల కోట్లను దాటింది. ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థల్లో భారత్ ముందు వరుసలో నిలిచింది. కార్పొరేట్ కంపెనీల ఆదాయాలు గణనీయంగా పెరగడం, చిన్న పెట్టుబడిదారులు ఉత్సాహంగా పెద్ద ఎత్తున స్టాక్ మార్కెట్లలో పెట్టుబడులు పెట్టడంలాంటి అంశాలన్నీ భారత స్టాక్ మార్కెట్లు జీవిత కాల గరిష్ఠ విలువలను నమోదు చేసుకోవడానికి దోహదం చేశాయి.
ఆసియాలో అతి సురక్షిత పెట్టుబడికి సానుకూల అవకాశాలున్న దేశంగా భారత్‌ను గోల్డ్‌మన్ శాక్స్ గ్రూప్ ఇంక్ ఓ నివేదికలో వెల్లడించింది. చైనాలో అనేక రంగాలు కుదేలు కావడం, అక్కడి స్టాక్ మార్కెట్లు అనిశ్చితలో ఉండటం కూడా భారత్‌కు కలసి వచ్చింది. దీంతో విదేశీ పెట్టుబడిదారులు భారత్‌ను పెట్టుబడికి సురక్షితమైన దేశంగా భావిస్తున్నట్టు గ్రూప్ ఇంక్ తన నివేదికలో వెల్లడించింది.
దేశంలో వృద్ధి అవకాశాలు, విధాన సంస్కరణలు, బలమైన క్రెడిట్ వృద్ధి భారతీయ ఈక్విటీ మార్కెట్ల పనితీరును మెరుగుపరిచాయని స్టాండర్డ్ చార్టర్డ్ బ్యాంక్ ఇన్వెస్ట్మెంట్ స్ట్రాటజిస్ట్ ఆడ్రి గోహ్ అభిప్రాయపడ్డారు. దేశంలో వ్యాపార, వాణిజ్యాన్ని మరింత ఆకర్షణీయంగా తీర్చిదిద్దడానికి భారత్ అడుగులు వేస్తోందని ఆయన కితాబిచ్చారు.
తాజాగా భారత స్టాక్ మార్కెట్ పెట్టుబడులు విలువ రూ.3 కోట్ల కోట్లు చేరి జీవిత కాల గరిష్ఠాలను నమోదు చేసింది. జీ20 సమావేశాలు జరుగుతున్న వేళ ఈ అంశం మరింత ప్రభావం చూపనుంది. అనేక కంపెనీలు చైనాను విడిచి భారత్‌లో తమ ఉత్పత్తిని ప్రారంభించేందుకు సిద్దం అవుతున్నాయి. యాపిల్, శ్యామ్‌సంగ్‌లాంటి కంపెనీలను భారత్ తీసుకువచ్చేందుకు ప్రధాని మోదీ స్వయంగా ప్రోత్సాహకాలు ప్రకటించారు.
విదేశీ పెట్టుబడిదారులు 2023లో ఇప్పటికే 1.13 లక్షల కోట్లతో స్టాక్స్ కొనుగోలు చేశారు. గడచిన మూడేళ్లలో ఇవి అతి పెద్ద మొత్తం కావడం గమనార్హం. చైనాలో రియల్ ఎస్టేట్ రంగం కుదేలు కావడం కూడా భారత్‌కు కలసి వచ్చింది. పెట్టుబడులకు భారత్ అనుకూలంగా ఉందని, రాబోయే పదేళ్లకు అక్కడే పెట్టుబడులు పెట్టాలనుకుంటున్నట్టు లండన్‌కు చెందిన జెఫరీస్ ఎల్ఎల్సిలో ఈక్విటీ స్ట్రాటజీ గ్లోబల్ హెడ్ క్రిస్ వుడ్ అభిప్రాయపడ్డారు. 2020లో కోవిడ్ కారణంగా భారత ఆర్థిక వ్యవస్థ కొంత మందగించినా నేడు, ప్రపంచంలోనే అతిపెద్ద ఐదో స్టాక్ మార్కెట్ పెట్టుబడిదారుగా ఉందని బ్లూమ్‌బెర్గ్ నివేదికలో వెల్లడించింది.
అవాంతరాలు కూడా పొంచి ఉన్నాయి
భారత్ పెట్టుబడిదారులకు సానుకూలంగా ఉండటమే కాదు అనేక సవాళ్లు కూడా ఉన్నాయి. పెరిగిపోయిన ముడి చమురు ధరలు, నిత్యావసర ధరలు ద్రవ్యోల్భణాన్ని పెంచేశాయి. మరోవైపు డాలరుతో రూపాయి విలువ ఎన్నడూ లేని విధంగా పతనమైంది. త్వరలో సాధారణ ఎన్నికలు కూడా ఉండటంతో పెట్టుబడిదారులు లాభాల స్వీకరణకు దిగే అవకాశం కనిపిస్తోంది. దేశంలో మౌలిక సదుపాయాలను వేగంగా పెంచడం, విద్యా ప్రమాణాలు మెరుగుపరచడం, యువ జనాభాకు తగినన్ని ఉద్యోగాలు కల్పించడం దేశం ముందున్న సవాళ్లుగా చెప్పవచ్చు.
చైనాలో కొంత ఆర్థిక అనిశ్చితి ఉన్నా పెట్టుబడిదారులు భారత్‌కు పెద్దగా వెళ్లడం లేదని మార్కెట్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఇప్పటికే భారత స్టాక్స్ అధిక ధరలో కొనసాగుతున్నాయని, గడచిన మూడు మాసాల్లో ఎన్ఎస్ఈ 50 స్టాక్స్ 6 శాతం పెరిగినట్టు వారు గుర్తు చేశారు. చైనా నుంచి అమెరికా కంపెనీలు పెట్టుబడులు ఉపసంహరించుకోవడం వల్ల ఇండోనేషియా, మెక్సికో, పోలండ్ దేశాలు ప్రయోజనం పొందే అవకాశం ఉందని ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు. ఏది ఏమైనా భారత ఆర్థిక వ్యవస్థను విస్మరించడానికి లేదని, భారత్ ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదగవచ్చని లండన్‌కు చెందిన ఆర్థిక విశ్లేషకుడు గోర్డాన్ బోవర్స్ అభిప్రాయపడ్డారు.