అత్యంత శక్తివంతమైన భూకంపం శుక్రవారం రాత్రి మొరాకో
దేశాన్ని వణికించేసింది. ఆ భూకంపంలో 296మంది చనిపోయినట్టు మొరాకో ప్రభుత్వం
ప్రాథమికంగా అంచనా వేసింది.
‘‘ప్రాథమిక అంచనాల ప్రకారం అల్ హవజ్, మరాకేష్,
ఓర్జాజాతే, అజిలాల్, చిచావువా, టారోడాంట్ ప్రావిన్సులు, మునిసిపాలిటీల్లో భూకంపం
వల్ల 296మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 153 మంది గాయపడ్డారు’’ అని మొరాకో హోంశాఖ
ఒక ప్రకటనలో వెల్లడించింది.
భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 6.8గా నమోదయింది.
ఈ భూకంపం ప్రభావంతో పలుచోట్ల ఇళ్ళు, భవనాలు దెబ్బ తిన్నాయి. మరాకేష్ నగరంలో జెమా
ఎల్ ఫనా స్క్వేర్ భవనం మీద ఒక మినార్ కూలిపోయింది. ఆ ఘటనలో ఇద్దరు గాయపడ్డారు.
మరాకేష్లో నివసించే ఒక వ్యక్తి, ‘‘భూ ప్రకంపనలు
చాలా భయంకరంగా ఉన్నాయి. దాన్ని బట్టి ఇక్కడ చోటు చేసుకున్నది భూకంపమని అర్ధమైంది.
పెద్దపెద్ద భవనాలు కదులుతుండడం చూసాను. వెంటనే బైటకు వచ్చాను. అప్పటికే చాలామంది
రోడ్లమీద ఉన్నారు. జనాలంతా షాక్లో, భయభ్రాంతులై ఉన్నారు. చిన్నపిల్లలు ఏడుస్తున్నారు.
తల్లిదండ్రులు అయోమయ స్థితిలో ఉన్నారు’’ అని చెప్పాడు.
మరాకేష్లోని ఆస్పత్రులన్నీ క్షతగాత్రులతో
నిండిపోయాయి. వారి ఆర్తనాదాలు నింగినంటుతున్నాయి. రక్తకేంద్రంలోని రక్తం యూనిట్లు
ఖాళీ అయిపోతున్నాయి. గాయపడినవారికి రక్తం ఉదారంగా దానం చేయాలంటూ బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్
సెంటర్ పిలుపునిచ్చింది.
మరాకేష్కు 71 కిలోమీటర్ల దూరంలో స్థానిక కాలమానం
ప్రకారం రాత్రి 11 గంటల తర్వాత భూమి ఉపరితలం నుంచి 18.5 కిలోమీటర్ల లోతులో భూకంపం
చోటు చేసుకుందని శాస్త్రవేత్తలు తేల్చారు. భూకంప ప్రభావం మరాకేష్కు కొద్దిపాటి
దూరంలో ఉన్న రాజధాని రబత్, కాసబ్లాంకా, ఎస్సౌరియా తదితర ప్రధాన నగరాల్లో సైతం
భూకంప ప్రభావం కనిపించింది.