టీడీపీ
అధినేత, మాజీ సీఎం చంద్రబాబు అరెస్టును నిరసిస్తూ ఆ పార్టీ శ్రేణులు నిరసన వ్యక్తం
చేస్తున్నాయి. పాలకపార్టీ మెప్పు కోసమే తమ అధినేతపై తప్పుడు కేసు పెట్టి అరెస్టు
చేశారని సీఐడీపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రజాస్వామ్య పద్ధతిలో నిరసన వ్యక్తం
చేయకుండా తమను అడ్డుకోవడంపై కూడా మండిపడుతున్నారు. టీడీపీ ముఖ్యనేతలను గృహనిర్బంధం
చేయడాన్ని తప్పుబడుతున్నారు.
చంద్రబాబు
కుమారుడు టీడీపీ జాతీయకార్యదర్శి నారా లోకేశ్ రోడ్డుపై బైఠాయించి నిరసన వ్యక్తం
చేస్తున్నారు. తన తండ్రిని చూడటానికి వెళ్తుంటే పోలీసులు అడ్డుకోవడంపై ఆగ్రహం
వ్యక్త చేశారు. యువగళం పాత్రయాత్రంలో భాగంగా బస చేసిన పొదలాడ క్యాంప్ సైట్ వద్ద ఆందోళనకు
దిగారు. పోలీసులు అడ్డగించిన చోటే రోడ్డు పై బైఠాయించిన నిరసన తెలుపుతున్నారు. లోకేశ్
పట్ల పోలీసులు వ్యవహరిస్తున్న తీరుపై ఆయన అభిమానులు, పార్టీ కార్యకర్తలు తీవ్రంగా
స్పందిస్తున్నారు. నోటీసులు ఇవ్వకుండా ఎలా అడ్డుకుంటారని ప్రశ్నిస్తున్నారు. నారా
లోకేశ్, వర్షంలోనే బైఠాయించి నిరసన తెలుపుతున్నారు
చంద్రబాబు
అరెస్టు నేపథ్యంలో సీఎం జగన్ పై బాలకృష్ణ నిప్పులు చెరిగారు. జగన్ పాలకుడు కాదని,
ఆయనొక కక్షదారుడని విమర్శించారు. ప్రజాసంక్షేమాన్ని గాలికొదిలి కక్ష సాధింపులకు
పాల్పడే ముఖ్యమంత్రి ఉండటం రాష్ట్రప్రజల దౌర్భాగ్యమని చెప్పారు.
తమ
పార్టీ అధినేత అరెస్టుపై మాజీమంత్రి దేవినేని ఉమా, ఎంపీ కేశినేని నాని, రాజ్యసభ
సభ్యుడు కనకమేడల రవీంద్రకుమార్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి దుర్మార్గ
చర్యలకు పాల్పడే వారికి ప్రజలే బుద్ధి చెబుతారన్నారు.
చంద్రబాబు
అరెస్టును ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురందరేశ్వరి ఖండించారు. సరైన నోటీసు
ఇవ్వకుండా, ఎఫ్ఐఆర్లో పేరు పెట్టకుండా, వివరణ తీసుకోకుండా నిబంధనలు ఉల్లంఘించి
అరెస్టు చేయడం సమర్థనీయం కాదన్నారు. చంద్రబాబు అరెస్టును బీజేపీ ఖండిస్తోందన్నారు.
విపక్షనేత
అరెస్టు సందర్భంగా రాష్ట్రంలో అప్రకటిత కర్ఫ్యూ కనిపిస్తోంది. టీడీపీ నేతలను గృహ
నిర్బంధం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా ఆర్టీసీ బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి.
చంద్రబాబును
అరెస్టు చేసిన తీరును సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ తప్పుబట్టారు.
అర్ధరాత్రి
పూట వచ్చి హంగామా చేయాల్సిన అవసరం ఏముందని ఆయన ప్రశ్నించారు. ముదుగా నోటీసులు
ఇచ్చి చర్యలు తీసుకోవాల్సిందని అభిప్రాయపడ్డారు. తండ్రి వద్దకు వెళ్ళకుండా లోకేశ్‌ను
పోలీసులు అడ్డుకోవడం దారుణమన్నారు.