కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తోన్న ప్రసాద్
పథకంతో సింహగిరిలో పెద్దఎత్తున అభివృద్ధి పనులు జరగనున్నాయి. బీజేపీ నేతృత్వంలోని
ఎన్డీయే ప్రభుత్వం అమలు చేస్తోన్న ప్రసాద్ పథకం సింహాచలం దేవస్థాన అభివృద్ధికి
రూ.55 కోట్ల సాయం అందనుంది. దీంతో దేవాలయ పరిధిలో చేపట్టాల్సిన అభివృద్ధి పనులపై దేవాదాయశాఖ అధికారులు, ధర్మకర్తల మండలి సభ్యులు చర్చించారు.
కొండ దిగువున ఉన్న పురాతనమైన పుష్కరణి
సత్రాన్ని తొలగించి ఆ స్థానంలో జీ ప్లస్ ఫైవ్ కింద కొత్త భవనాన్ని నిర్మించాలని
సమావేశంలో నిర్ణయించినట్లు దేవాదాయ శాఖ కమిషనర్ సత్యనారాయణ తెలిపారు. ప్రస్తుతం
ఉన్న పుష్కరణి సత్రం నిర్మించి నాలుగు దశబ్దాలు గడిచిందని దాని స్థానంలో
రెండువైపులా కొత్తగా నిర్మిస్తామని తెలిపారు. కళ్యాణ
మండపం మాత్రం యథాతథంగా ఉంటుందని స్పష్టం చేశారు.
1936లో నిర్మించిన ఆగమ పాఠశాల శిథిలావస్థకు
చేరిందని దానిని ఆదునీకరించి ఇతర అవసరాలకు ఉపయోగిస్తామన్నారు. మరో ప్రాంతంలో
కొత్తగా వేదపాఠశాల కోసం భవనాల నిర్మాణం జరుగుతుందని తెలిపారు. ఈవో కార్యాలయాన్ని
కూడా కొత్తగా నిర్మించాల్సి ఉందని వివరించారు. రెండో టోల్ గేట్ దగ్గర సువిశాలమైన
పార్కింగ్ సదుపాయం అవసరమని, అందుకు అవసరమైన స్థలాన్ని పర్యాటక శాఖకు కేటాయిస్తామని
చెప్పారు.
కొండపైన అధునాతనమైన క్యూ కాంప్లెక్స్
లు నిర్మించడంతో పాటు ప్రస్తుతం ఉన్న
యాగశాల స్థానంలో సువిశాలంగా మరో యాగశాలను నిర్మించనున్నట్లు వివరించారు. ఇందుకోసం స్థానాచార్యులు డాక్టర్
రాజగోపాల్, ప్రధాన అర్చకులు శ్రీనివాసచార్యులు, రమణాచార్యులు నుంచి సలహాలు తీసుకున్నామన్నారు.
ఆలయ మాస్టర్ ప్లాన్
కు తగ్గట్లుగానే ఆయా అభివృద్ధి పనులు చేపడతామన్నారు.
అనంతరం సింహాద్రి అప్పన్నను దేవాదాయశాఖ
కమిషనర్ సత్యనారాయణ దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ధర్మకర్త మండలి సభ్యులు,
సత్యనారాయణను ఘనంగా సత్కరించారు.