డీఎంకే
నేతల నోటితీటతో మిత్రపక్షమైన కాంగ్రెస్ నానా అగచాట్లు పడాల్సి వస్తోంది. సనాతన
ధర్మంపై డీఎంకే నేతలు చేస్తున్న వ్యాఖ్యల కారణంగా దేశవ్యాప్తంగా తమపై వ్యతిరేకత
పెరుగుతోందని భావించిన హస్తం నేతలు దిద్దుబాటు చర్యలకు దిగారు. డీఎంకే తమ
మిత్రపక్షమైనప్పటికీ వారి వ్యాఖ్యలతో తమకు సంబంధం లేదని చెబుతున్నారు. రాజ్యాంగం
కల్పించిన వాక్ స్వేచ్ఛలో భాగంగానే మాట్లాడుతున్నారని సమర్థించుకోవాల్సిన
పరిస్థితి దాపురించింది.
సనాతన
ధర్మాన్ని నిర్మూలించాలంటూ తమిళనాడు మంత్రి ఉదయనిధి స్టాలిన్ చేసిన వ్యాఖ్యలను
పలువురు తప్పుబడుతున్నారు. తన వ్యాఖ్యలపై వెనక్కి తగ్గేది లేదంటూనే అలా అనలేదని,
వక్రీకరించారని తాము ఎవరికీ వ్యతిరేకం కాదని వివరణ ఇచ్చారు.
ఉదయనిధి
వ్యాఖ్యలతో రేగిన ఆగ్రహ జ్వాలలు తగ్గుముఖం పడుతున్న తరుణంలో ఆ పార్టీ సీనియర్ నేత
మళ్లీ విపరీత వ్యాఖ్యలతో అగ్గి రాజేశారు. సనాతన ధర్మాన్ని ఉదయనిధి డెంగీ, మలేరియా,
కరోనాతో పోలిస్తే రాజా ఏకంగా హెచ్ఐవీ, కుష్టురోగాలతో పోల్చారు. ప్రస్తుత సమాజాన్ని
భయపెట్టే భయంకర రోగాలతో పోల్చాలన్నారు.
ఉదయనిధి స్టాలిన్ సున్నిత మనస్కులు కావడంతో
డెంగీ, మలేరియాతో పోల్చారని భాష్యం చెప్పారు.
సనాతన
ధర్మంపై ఎవరు చర్చకు ఆహ్వానించినా వెళతానన్న రాజా, అంబేద్కర్, పెరియార్ రాసిన
పుస్తకాలను తోడు తీసుకెళ్తానన్నారు. కేంద్రమంత్రులు సహా ప్రధానితో సైతం ఈ విషయంపై
చర్చించేందుకు తాను సిద్ధంగా ఉన్నట్లు వెల్లడించారు.
టుజీ
కుంభకోణంలో తీహార్ జైలు ఊచలు లెక్కపెట్టిన కేంద్రమాజీ మంత్రి రాజా, సనాతన ధర్మం
గురించి మాట్లాడడం హాస్యాస్పదంగా ఉందని పలువురు దుయ్యబడుతున్నారు.
అన్ని
మతాలు సమానమని చెప్పే కాంగ్రెస్ డీఎంకే నేతల ప్రేలాపనలపై ఎందుకు మౌనం వహిస్తోందని
ప్రశ్నిస్తున్నారు. తనను తాను లౌకికవాద పార్టీగా చెప్పుకునే కాంగ్రెస్, సనాతన
ధర్మం గురించి ఆ పార్టీ మిత్రులు చులకనగా మాట్లాడితే ఎందుకు స్పందించడం లేదని
నిలదీస్తున్నారు.
కాంగ్రెస్ ఓటు బ్యాంకు రాజకీయాల్లో భాగంగానే ఇలాంటి
పరిస్థితులు ఉత్పన్నమవుతున్నాయని మండిపడుతున్నారు. మైనార్టీల ఓట్ల కోసం మెజారిటీ
ప్రజల విశ్వాసాన్ని దెబ్బతీస్తోందనే విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.