లోక్‌సభ
ఎన్నికలు సమీపిస్తున్న వేళ కన్నడ రాజకీయాల్లో కీలక ఘట్టం చోటుచేసుకుంది. ఇప్పటి
వరకు ప్రత్యర్థులుగా మెలిగిన బీజేపీ, జేడీఎస్ మిత్రపక్షాలుగా మారబోతున్నాయి. ఇరుపార్టీలూ
కలిసి పనిచేసేందుకు సిద్ధమయ్యాయి.
వచ్చే
లోక్‌సభ
ఎన్నికల్లో బీజేపీతో కలిసి పనిచేసే అంశంపై జనతాదళ్ (సెక్యులర్) సూత్రప్రాయంగా అంగీకరించినట్లు బీజేపీ
పార్లమెంటరీ నేత, మాజీ సీఎం యడియూరప్ప
తెలిపారు. లోక్‌సభ సీట్ల విషయంలోనే అవగాహన
కుదిరినట్లు వెల్లడించారు. బీజేపీ అగ్రనేతలతో సమావేశమైన జేడీఎస్ అధినేత దేవేగౌడ,
పొత్తుకు సంబంధించిన చర్చలు జరిపారు.
వచ్చే
లోక్ సభ ఎన్నికల్లో జేడీఎస్ కు నాలుగు సీట్లు ఇచ్చేందుకు బీజేపీ అగ్రనేత అమిత్ షా
అంగీకరించారని, ఇది తమకు బలాన్ని ఇవ్వడంతో పాటు కర్ణాటకలో 25 నుంచి 26 సీట్లు
గెలిచేందుకు దోహదపడుతుందన్నారు.
మొత్తం 28 లోక్ సభ స్థానాల్లో జేడీఎస్ కనీసం
ఆరుచోట్ల నేరుగా ప్రభావితం చూపుతుందని అంచనా, మధ్య కర్ణాటకలోని హాసన, మాండ్య,
మైసూరు, తుమకూరు, కోలార, చామరాజనగర, బెంగళూరు గ్రామీణ, అర్బన్ ఏరియాలోని మూడు
చోట్ల జేడీఎస్ ప్రభావం ఉంటుంది. మిగిలిన లోక్ సభ స్థానాల్లోనూ ఒక్కళిగ ఓట్లను
చీల్చే సత్తా జేడీఎస్‌కు ఉన్న కారణంగా, ఆ పార్టీతో పొత్తుకు బీజేపీ సిద్ధంగా
ఉన్నట్లు సమాచారం.
2019
ఎన్నికల్లో బీజేపీ 28సీట్లకు గాను 25 చోట్ల విజయం సాధించింది. కాంగ్రెస్, జేడీఎస్
చెరోచోట విజయం సాధించారు.
2023
అసెంబ్లీ ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేసిన జేడీఎస్ , కేవలం 19 స్థానాల్లో గెలుపుతో
సరిపుచ్చుకోవాల్సి వచ్చింది. దీంతో పార్టీ ఉనికికే ప్రమాదం పొంచి ఉందనే ఆలోచనలో
జాతీయ పార్టీలతో పొత్తుకు సిద్ధమయ్యారు.