జీ-20
సమావేశాల సందర్భంగా ఏర్పాటు చేసిన నటరాజ స్వామి భారీ విగ్రహాన్ని ప్రధాని మోదీ తన
ఎక్స్ ఖాతా కవర్ ఫొటోగా పెట్టుకున్నారు. దిల్లీలోని ప్రగతి మైదాన్‌లో రంగరంగ వైభవంగా
కట్టుదిట్టమైన భద్రత మధ్య మనదేశ అధ్యక్షతన జీ-20 సదస్సు జరుగుతోంది. సదస్సు కోసం
అలాగే విదేశీ అతిథుల కోసం భారీ ఏర్పాట్లు చేసిన అధికారులు, ప్రగతి మైదాన్ వద్ద
ఏర్పాటు చేసిన నటరాజస్వామి విగ్రహం అందరినీ ఆకర్షిస్తోంది. అత్యంత సుందరమైన ఆ
విగ్రహం ఫొటోను ప్రధాని మోదీ తన ఎక్స్ ఖాతా కవర్ ఫోటోగా పెట్టుకోవడం గమనార్హం.
నటరాజస్వామి
విగ్రహ బరువు 18 టన్నులు కాగా, దీనిని అష్టధాతువులతో తయారు చేశారు. ఇందిరాగాంధీ
జాతీయ కళా కేంద్రం వెల్లడించిన వివరాల ప్రకారం, కాపర్, జింక్, లెడ్, టిన్, బంగారం,
పాదరసం, ఇనుముతో తో ఈ భారీ విగ్రహాన్ని నిర్మించారు.
నాట్యానికి
ప్రభువుగా భావించే ఆదిదేవుడు నాట్యం చేస్తున్న విగ్రహాన్ని జీ20 వేదిక దగ్గర
ప్రతిష్టించారు. సదస్సు కోసం ఏర్పాటు చేసిన ఊదా రంగు లైట్ల కాంతితో ఈ భారీ విగ్రహం
మరింత ప్రకాశవంతంగా ఆకర్షణీయంగా మిరుమిట్లు గొల్పుతూ దర్శనమిస్తోంది.
తమిళనాడు
లోని స్వామిమలైకి చెందిన శిల్పి రాధాకృష్ణ స్థపతి, అతని బృందం దీనిని చెక్కారు.
ఏడు నెలల పాటు నిర్విరామంగా శ్రమించి విగ్రహాన్ని నిర్మించినట్లు తెలుస్తోంది.
గ్రీన్
కారిడార్ ద్వారా తమిళనాడు నుంచి దిల్లీకి దీనిని తరలించారు. ఎలాంటి అతుకులు
లేకుండా ఈ విగ్రహాన్ని తయారు చేశారు.
ఈ భారీ విగ్రహం కోసం కేంద్రప్రభుత్వం సుమారు
రూ. 12 కోట్లు ఖర్చు చేసినట్లు సమాచారం.
అత్యంత
వైభవంగా సమావేశాల నిర్వహణకు సిద్ధమైన కేంద్రప్రభుత్వం, దేశంలోని అన్ని ప్రాంతాల
విశిష్ఠతలకు చోటు లభించేలా కృషి చేస్తోంది, దేశీయ సంగీతంతో అతిథులను అలరించడంతో
పాటు విదేశీ ప్రతినిధులకు దేశంలోని ప్రముఖ వంటలను రుచిచూపుతోంది.