రష్యా-ఉక్రెయిన్ మధ్య శాంతి కోసం ప్రయత్నిస్తూనే,
భారతదేశం తన సార్వభౌమ, ఆర్థిక ప్రయోజనాల పరిరక్షణకు ప్రాధాన్యం ఇవ్వడం ద్వారా సరైన
పనే చేసిందని మన్మోహన్ సింగ్ అన్నారు. జి-20 సమావేశాల సందర్భంగా ఓ పత్రికకు ఇచ్చిన
ఇంటర్‌వ్యూలో మాజీ ప్రధానమంత్రి ఈ వ్యాఖ్యలు చేసారు.
2004-2014 మధ్య కాలంలో రెండుసార్లు
ప్రధానమంత్రిగా పనిచేసిన మన్మోహన్ సింగ్‌కు శనివారం నాటి జి-20 విందుకు ఆహ్వానం
అందింది. జి-20 సదస్సుకు అధ్యక్షత వహించే అవకాశం భారత్‌కు రావడంపై మన్మోహన్ హర్షం
వ్యక్తం చేసారు.
‘‘జి-20 సదస్సుకు అధ్యక్షత వహించే అవకాశం
భారతదేశానికి నా జీవితకాలంలోనే రావడం చాలా సంతోషంగా ఉంది. ప్రపంచ దేశాల నాయకులకు
భారతదేశం ఆతిథ్యం ఇస్తుండడాన్ని చూస్తున్నాను. భారతదేశపు పరిపాలనా విధానంలో
విదేశాంగ విధానానికి ఎప్పుడూ అమిత ప్రాధాన్యత ఉంది. అయితే అదిప్పుడు మరింత ఎక్కువ
ప్రాధాన్యత సంతరించుకుంది, దేశీయ రాజకీయాలకు కూడా ప్రధానంగా మారింది. ప్రపంచంలో మనదేశం
స్థాయి పెరగడం స్థానిక రాజకీయాల్లో ఒక అంశం కావచ్చు. అయితే దేశం అనుసరించే దౌత్య
విధానాలను, విదేశీ వ్యవహారాలను ఒక పార్టీ లేదా వ్యక్తి రాజకీయాలకు ఉపయోగించుకోవడం
విషయంలో మాత్రం నియంత్రణ పాటించాలి’’ అని వ్యాఖ్యానించారు.
రష్యా-ఉక్రెయిన్ విషయంలో భారత్ వైఖరిని
మన్మోహన్ సమర్ధించారు. దౌత్యపరంగా అత్యంత సంక్లిష్టమైన పరిస్థితిని ఎదుర్కొనడంలో
దేశం సరైన అడుగులే వేసిందన్నారు.
‘‘రెండు లేదా అంతకంటె ఎక్కువ శక్తుల మధ్య
సంఘర్షణ నెలకొంటే, వారిలో ఎవరి వైపు ఉండాలా అన్నది తేల్చుకోవడం ఇతర దేశాలపై చాలా
ఒత్తిడి మోపుతుంది. భారతదేశం శాంతి కోసం రెండు దేశాలకూ విజ్ఞప్తి చేసింది. దానికంటె ముందు తన సార్వభౌమ,
ఆర్థిక ఆసక్తులకు ప్రాధాన్యం ఇవ్వడం ద్వారా భారత్ సరైన పనే చేసింది. జి-20 సదస్సు భద్రతా పరమైన విభేదాలను తేల్చుకునే వేదికగా ఎన్నడూ
లేదు. కాబట్టి ఇప్పుడు కూడా భద్రత సంబంధిత అంశాలను పక్కన పెట్టాలి. వాతావరణ
మార్పులు, ప్రపంచ వాణిజ్యం, అసమానతలు వంటి సవాళ్ళను ఎదుర్కొనడానికి విధానపరమైన
సమన్వయం సాధించడం మీద దృష్టి సారించాలి’’ అని సూచించారు.
75 ఏళ్ళ స్వాతంత్ర్యం
సందర్భంగా దేశం భవిష్యత్తు గురించి తనకు ఆందోళన లేదనీ, నిజానికి ఎంతో ఆశాభావంతో
ఉన్నాననీ మన్మోహన్ అన్నారు. ‘‘మొత్తంగా చూసుకుంటే, భారత్ భవిష్యత్తు గురించి నాకు
ఆందోళన కంటె ఆశాభావమే ఎక్కువగా ఉంది. అయితే నా ఆశాభావం దేశం ఎంత సామరస్యపూర్వకంగా
ఉంటుందనే దానిపై ఆధారపడి ఉంటుంది. దేశ ప్రగతికి, అభివృద్ధికీ సామరస్యమే ప్రధాన ఆధారం.
భారతదేశపు మౌలిక లక్షణమే అన్నిరకాల వైవిధ్యాలనూ ఆహ్వానించడం. ఆ సంప్రదాయాన్ని మనం
నిలుపుకోవాలి’’ అని మన్మోహన్ చెప్పుకొచ్చారు.