సనాతన
ధర్మాన్ని నిర్మూలించడం ఎవరి తరమూ కాదని ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్
అన్నారు. సనాతన ధర్మాన్ని నిర్మూలించాలంటూ డీఎంకే నేత, తమిళనాడు
మంత్రి ఉదయనిధి స్టాలిన్ చేసిన వ్యాఖ్యలపై స్పందించిన యూపీ సీఎం.. రావణుడే సనాతన
ధర్మాన్ని ఏం చేయలేకపోయాడని ఇక రాజకీయ పరాన్నజీవులు ఏం
చేయగలరని ప్రశ్నించారు.
శ్రీకృష్ణ
జన్మాష్టమి సందర్భంగా లక్నో లో నిర్వహించిన వేడుకల్లో పాల్గొన్న సీఎం యోగీ, నూతనోత్సాహాలతో
దేశం అభివృద్ధిలో దూసుకుపోతుంటే కొద్దిమంది తట్టుకోలేకపోతున్నారని ధ్వజమెత్తారు.
ప్రపంచంలో కీలక శక్తిగా భారత్ ఎదగడాన్ని వారు ఇష్టపడటం లేదని దెప్పిపొడిచారు.
అమృతకాలంలో దేశం పురోగతి సాధిస్తూ కొత్త చరిత్రను లిఖిస్తోందన్నారు.
అభివృద్ధిలో
భారత జైత్రయాత్రను బలహీనపర్చేందుకు కొంతమంది సనాతన ధర్మం గురించి అవాకులు చెవాకులు
పేలుతున్నారని ఘాటు విమర్శలు చేశారు.
‘‘
రావణుడి అహంకారానికి సనాతనం అంతం కాలేదు. కంసుడి గర్జనకు సనాతన ధర్మం చలించలేదు.
మొఘల్ పాలకులైన బాబర్,
ఔరంగజేబు దురాగతాలకు సనాతన ధర్మం నశించలేదు. అలాంటిది ఇలాంటి
పరాన్నజీవులతో అవుతుందా..’’ అని ప్రశ్నించారు.
ఎంతో
ప్రతిష్టాత్మక సదస్సు అయిన జీ-20కి వసుధైవ కుటుంబ స్ఫూర్తితో దేశం ఆతిథ్యం
ఇస్తున్న సమయంలో కొంతమంది స్వార్థపరులు భారత వారసత్వంపై దాడులు చేస్తున్నారని
మండిపడ్డారు. ఎన్నో ఏళ్ళుగా ఆచరిస్తున్న సనాతన ధర్మాన్ని రూపుమాపాలని
పిలువునివ్వడం దురదృష్టకరమన్నారు.
తన
వ్యాఖ్యలపై రేగిన దుమారం,
ఎదురవుతున్న విమర్శలపై ఉదయనిధి స్టాలిన్ వివరణ ఇచ్చారు. తాను గానీ
డీఎంకే గాని ఏ మతానికి వ్యతిరేకం కాదన్నారు.
చెన్నైలో
నిర్వహించిన సమావేశంలో పాల్గొన్న ఉదయనిధి, సనాతన ధర్మం, సామాజిక న్యాయానికి వ్యతిరేకమని విమర్శించారు. మలేరియా, డెంగీలాగే దానిని కూడా నిర్మూలించాలని పిలుపునిచ్చారు. దీనిపై బీజేపీ,
సహా పలు హిందూ సంఘాలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి.