బెంగళూరు-చెన్నై
ఎక్స్‌ప్రెస్ హైవే నిర్మాణ పనులు 2023 చివరిలో లేదా 2024 జనవరిలో ప్రారంభిస్తామని కేంద్రమంత్రి
నితిన్ గడ్కరీ తెలిపారు. ఈ జాతీయ రహదారి నిర్మాణం పూర్తి అయితే రెండు నగరాల మధ్య
ప్రయాణం రెండు గంటల్లోనే పూర్తి అవుతుందని చెప్పారు.
అశోక్
లేలాండ్ 75వ వార్షికోత్సవ వేడుకల్లో పాల్గొన్న కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ.. జాతీయ
రహదారుల నిర్మాణంపై సమీక్ష నిర్వహించినట్లు తెలిపారు. బెంగళూరు-చెన్నై ఎక్స్‌ప్రెస్
హైవే నిర్మాణం పూర్తి అయితే ఈ మార్గంలో లగ్జరీ బస్సులు, స్లీపర్ కోచ్‌లను
ప్రారంభించవచ్చు అని సూచించారు. ప్రయాణ దూరం తగ్గడంతో టికెట్ ధరలను కూడా 30 శాతం
తగ్గించాలని కోరారు.
బెంగళూరు-చెన్నై
జాతీయ రహదారి, బెంగళూరు శివారులోని హోస్కోట్ నుంచి ప్రారంభమై తమిళనాడులోని
కాంచీపురం జిల్లాలోని శ్రీపెరంబుదూర్ లో ముగుస్తుంది. కర్ణాటక, ఆంధ్రప్రదేశ్,
తమిళనాడు మీదుగా వెళ్తుంది.
ప్రధాని
మోదీ 2022 మేలో ఈ ఎక్స్‌ప్రెస్ వేకు శంకుస్థాపన చేశారు. దీని పొడవు 262
కిలోమీటర్లు. నిర్మాణ వ్యయం రూ.14,870 కోట్లు. ఈ రహదారి నిర్మాణం పూర్తి అయితే
కేవలం రెండు గంటల్లో బెంగళూరు నుంచి చెన్నైకు రాకపోకలు సాగించవచ్చు. ప్రస్తుతం
ప్రయాణం చేసేందుకు ఐదు నుంచి ఆరు గంటల సమయం పడుతోంది.
ఈ ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికం పూర్తి అయ్యేనాటికి
2250 కిలోమీటర్ల మేర జాతీయ రహదారుల నిర్మాణం జరిగినట్లు తెలిపారు. 2024 నాటికి
13,800 కిలోమీటర్ల మేర నిర్మాణం చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు వివరించారు.
ఎన్డీయే హయాంలో జాతీయరహదారుల నిర్మాణం అంతకు
ముందు కంటే 59 శాతం పెరిగిందని తెలిపారు. అమెరికా తర్వాత అత్యంత పెద్ద
రోడ్డుమార్గం కల్గిన దేశంగా భారత్ నిలిచిందని పేర్కొన్నారు.