జీ-20
సమావేశాల సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ క్షణం తీరకలేకుండా గడపాల్సి వస్తోంది.
వివిద దేశాల అధినేతలతో భేటీలు, అంతర్జాతీయ సంస్థల ప్రతినిధులతో సమావేశాల్లో ఆయన
పాల్గొనేలా ప్రధానమంత్రి కార్యాలయం షెడ్యూల్ రూపొందించింది. ప్రపంచ నేతలతో 15కు పైగా
ద్వైపాక్షిక సమావేశాల్లో పాల్గొంటారని అధికారిక వర్గాలు వెల్లడించాయి.
అమెరికా
అధ్యక్షుడు జో బైడెన్‌తో తన నివాసంలో భేటీ కానున్న ప్రధాని నరేంద్ర మోదీ,
బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనాతోనూ ద్వైపాక్షిక సమావేశాలు జరపనున్నారు.
బ్రిటన్,
జర్మనీ, జపాన్ దేశాల అధినేతలతో సెప్టెంబర్ 9న భేటీ అవుతారు. ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యుయేల్
మ్యాక్రాన్ తో ఆదివారం ప్రధాని లంచ్ మీటింగ్
నిర్వహించనున్నట్లు అధికారిక వర్గాలు వెల్లడించాయి. ఆ తర్వాత కెనడా ప్రధానితో
కొంతసేపు ముచ్చటించనున్నారు.
తుర్కియే, యూఏఈ, దక్షిణ కొరియా, కొమొరోస్, యూరోపియన్
కమిషన్, బ్రెజిల్, నైజీరియా దేశాల నేతలతోనూ సమావేశాల సందర్భంగా ప్రధాని
ముచ్చటిస్తారు.
1999లో
జీ-20 కూటమి ఆవిర్భావం తర్వాత మొదటిసారి భారత్ అధ్యక్షతన దిల్లీ వేదికగా ఈ సదస్సు
జరుగుతోంది.
గత ఏడాది నుంచి జీ-20కి అధ్యక్షత వహిస్తున్న భారత్, వచ్చే ఏడాది
బాధ్యతలను బ్రెజిల్ కు అప్పగించనుంది.
జీ-20
సదస్సు సందర్భంగా అతిథులకు భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము విందు ఏర్పాటు చేశారు.
అతిథులతో పాటు మాజీ ప్రధానులు, కేబినెట్ మంత్రులు, ముఖ్యమంత్రులు, ఉన్నతాధికారులు,
పారిశ్రామికవేత్తలను ఈ విందుకు ఆహ్వానించారు. మాజీ ప్రధానులు మన్మోహన్ సింగ్,
దేవెగౌడ లకు ఆహ్వానం అందింది.
దిల్లీ
ప్రగతి మైదాన్‌లోని భారత మండపంలో ఈ విందు జరగనుంది. దీంతో పాటుగా సాంస్కృతిక
కార్యక్రమాలు జరగనున్నాయి.
అతిథులకు మంచి సంగీతం అందించేందుకు వాయిద్యకారులు
సిద్ధమయ్యారు. భారతీయ సంగీత వారసత్వ సంపద ఎంతటి గొప్పదో ప్రత్యక్షంగా చూపేందుకు
సమాయత్తమయ్యారు. సంతూర్, సారంగీ, జల్ తరంగ్, షహనాయ్ ఇలా దేశవ్యాప్తంగా విభిన్న
ప్రాంతాల్లో ప్రఖ్యాతిగాంచిన మొత్తం 78 రకాల వాద్య పరికరాల నుంచి ఉద్భవించే సంగీతం
ఆహూతులను అలరించనుంది.