గడచిన రెండు నెలలు వినియోగదారులకు చుక్కలు చూపించిన టొమాటో ధరలు దారుణంగా పతనం అయ్యాయి. జులై, ఆగష్టు మాసాల్లో కిలో రూ.100 నుంచి గరిష్ఠంగా రూ.250 వరకు ఎగబాకాయి. తాజాగా మార్కెట్లకు టొమాటోలు పెద్ద ఎత్తున రావడంతో కిలో రూ.2కు పడిపోయాయి. దీంతో కర్నూలు జిల్లా ప్యాపిలి, డోన్ ప్రాంతాల రైతులు రోడ్డు పక్కన పడేశారు. రవాణా, కోత కూలీ ఖర్చులు కూడా రావడం లేదని రైతులు ఆందోళనకు దిగారు. ప్రభుత్వం కొనుగోలు చేసి గిట్టుబాటు ధర కల్పించాలని రైతులు కోరుతున్నారు.
గత రెండు నెలల్లో టొమాటోలకు మంచి ధర రావడంతో రైతులు పెద్ద ఎత్తున సాగు చేపట్టారు. దీంతో అనంతపురం, మదనపల్లి, పుంగనూరు, ప్యామిలి, ప్రత్తికొండ, డోన్ మార్కెట్లకు టొమాటోలు పెద్ద ఎత్తున వస్తున్నాయి. దీంతో వ్యాపారులు కొనుగోలు చేసేందుకు ముందుకు రావడం లేదు. కర్నూలు జిల్లా ప్యామిలి మార్కెట్లో టొమాటో ధరలు పతనం కావడంతో రైతులు రోడ్ల వెంట పారిబోసి వెళ్లిపోయారు. కొందరు పశువులకు ఆహారంగా వేశారు. గత రెండు నెలలు వినియోగదారులకు చుక్కలు చూపించిన టొమాటోలు, నేడు రైతుకు కన్నీరు తెప్పించడం గమనార్హం.
ఆస్తులన్నీ కాజేసిన అన్నగా జగన్ చరిత్రలో నిలిచిపోతారు : షర్మిల