సనాతన ధర్మంపై తమిళనాడు మంత్రి ఉదయనిధి స్టాలిన్ చేసిన వ్యాఖ్యలను, సీఎం స్టాలిన్ సమర్ధించుకున్నారు. సనాతన ధర్మాన్ని బోధించే అమానవీయ సూత్రాలు, షెడ్యూల్డ్ కులాలు, తెగలు, మహిళల పట్ల వివక్ష చూపుతున్నాయని, ఏ మత విశ్వాసాలను కించ పరిచే ఉద్దేశం తమకు లేదని సీఎం స్టాలిన్ వివరణ ఇచ్చారు. కొందరు కుల ఆధారిత వివక్షను ప్రచారం చేస్తున్నారు, ఆధ్యాత్మిక వేదికలపై మహిళలను కించపరుస్తున్నారని ఆయన అన్నారు. ఇలాంటి వర్గాల అణచివేతకు వ్యతిరేకంగా ఉదయనిధి మాట్లాడటాన్ని బీజేపీ అనుకూల శక్తులు జీర్ణించుకోలేకపోతున్నాయని స్టాలిన్ ఆరోపించారు.
మనం చంద్రునిపైకి ఉపగ్రహాన్ని పంపించినప్పటికీ, కొందరు కుల వివక్షను ప్రచారం చేస్తూనే ఉన్నారని స్టాలిన్ ధ్వజమెత్తారు. వర్ణాశ్రమ సూత్రాల ఆధారంగా సామాజిక వర్గీకరణను నొక్కిచెప్పడం, మతపరమైన వాదనలకు మద్దతుగా శాస్త్రాలు, ఇతర ప్రాచీన గ్రంథాలను ఉదహరించడం, ఆధ్యాత్మిక వేదికలపై మహిళలను కించపరచడం చేస్తున్నారని, స్త్రీలు పని చేయకూడదని, వితంతువులు పునర్వివాహం చేసుకోకూడదని వాదిస్తున్నారని స్టాలిన్ తప్పుపట్టారు. సగానికిపైగా ఉన్న మహిళల అణచివేతను కొనసాగించడానికే సనాతన ధర్మాని ఉపయోగిస్తున్నారని, ఇలాంటి వాటికి వ్యతిరేకంగా మాత్రమే ఉదయనిధి మాట్లాడారని స్టాలిన్ సమర్ధించుకున్నారు.
ఉదయనిధి మారన్ ప్రజల మారణహోమానికి పిలుపునిచ్చాడంటూ బీజేపీ నేతలు తప్పుడు ప్రచారం చేస్తున్నారని స్టాలిన్ విమర్శించారు. అయోధ్యలో ఓ ఆలయ పూజారి ఉదయనిధి స్టాలిన్ తల తీసుకువస్తే రూ.10 కోట్లు బహుమానం ఇస్తామని ప్రకటించినా అక్కడ బీజేపీ ప్రభుత్వం చర్యలు తీసుకుందా అని ప్రశ్నించారు.
సనాతన ధర్మంపై ఉదయనిధి చేసిన వ్యాఖ్యలపై సరైన స్పందన అవసరం అంటూ ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలను కూడా స్టాలిన్ తప్పుపట్టారు. ప్రధాని తెలియక మాట్లాడుతున్నారా, తెలిసే అలా మాట్లాడుతున్నారా? అంటూ ఆయన అనుమానం వ్యక్తం చేశారు. ఇండియా కూటమికి భయపడి వన్ నేషన్ వన్ ఎలక్షన్ అంటూ ప్రధాని మాట్లాడుతున్నారు కానీ సనాతన ధర్మంలో వివక్షాపూరిత విషయాల గురించి ప్రధాని మోదీ నోరు విప్పడం లేదని స్టాలిన్ సుదీర్ఘ వివరణ ఇచ్చారు.
రాహుల్ గాంధీకి యూపీ కోర్టు సమన్లు