తిరుమల కాలినడక మార్గంలో చిరుతల కలకలం తగ్గడం లేదు. తాజాగా మరో చిరుత బోనులో చిక్కింది. దీంతో గడచిన రెండు నెలల్లో ఐదు చిరుతలు బోనులో చిక్కాయి. తిరుమల అలిపిరి నడక మార్గంలో నరసింహస్వామి ఆలయం నుంచి 7వ మైలు మధ్యలో చిరుత బోనులో చిక్కినట్టు అటవీ శాఖ అధికారులు తెలిపారు. రెండు నెలల్లో ఐదు చిరుతలను బంధించడంతో దాదాపుగా చిరుతల సంచారం తగ్గినట్టేనని అధికారులు భావిస్తున్నారు.
వారం కిందట ఓ చిరుత కదలికలను ట్రాప్ కెమెరా విజువల్స్‌లో గుర్తించారు. దాన్ని బంధించేందుకు
బోనులు ఏర్పాటు చేశారు. గత రాత్రి చిరుత బోనులో చిక్కినట్టు అధికారులు గుర్తించి, దాన్ని తిరుపతిలోని జూ పార్కుకు తరలించారు. గతంలో నెల్లూరు జిల్లాకు చెందిన ఆరేళ్ల లక్షితను చిరుత పొట్టనబెట్టుకోవడంతో అటవీ శాఖ అధికారులు అప్రమత్తం అయ్యారు. నడకదారి భక్తులకు కర్రలు అందజేసిన మరసటి రోజే చిరుత బోనులో చిక్కడం గమనార్హం.