యువగళం పాదయాత్రలో తాను ఎవరినీ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయలేదని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ అన్నారు. భీమవరం సమీపంలోని బేతపూడి యువగళం క్యాంప్‌సైట్‌లో లోకేశ్‌కు పోలీసులు నోటీసులు అందించారు. వైసీపీ నేతలు తమను రెచ్చగొట్టేలా ఫ్లెక్లీలు పెడుతున్నారని ఆయన మండిపడ్డారు.
మంగళవారంనాడు తాడేరు వద్ద వైసీపీ నాయకులు, కార్యకర్తలే తమపై రాళ్ల దాడికి దిగారని నారా లోకేష్ పోలీసు అధికారులకు వివరించారు. యువగళంలో పనిచేస్తోన్న టీడీపీకి చెందిన 50 మంది వాలంటీర్లను అర్థరాత్రి అరెస్టు చేయడంపై నారా లోకేశ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అరెస్టు చేసిన టీడీపీ వాలంటీర్లను వివిధ స్టేషన్లుకు తిప్పుతున్నారని, వారు ఎక్కడున్నారో చెప్పాలని లోకేశ్ పోలీసులను నిలదీశారు.
తాను పాదయాత్ర చేస్తోంది ప్రజల సమస్యలు తెలుసుకోవడానికి, వైసీపీ శ్రేణులతో గొడవలు పెట్టుకోవడానికి కాదని లోకేశ్ అన్నారు. పాదయాత్రకు పోలీసులు సహకరించాలని కోరారు. యువగళం పాదయాత్రలోని టీడీపీ వాలంటీర్లను అరెస్టు చేసి వైసీపీ నేతల ఫ్యాక్టరీలో దాచారని లోకేశ్ విమర్శించారు. తమపై దాడికి దిగుతోన్న వైసీపీ వారికే పోలీసులు భద్రత కల్పిస్తున్నారని ఆయన తప్పుపట్టారు. చట్టం ఎవరి చుట్టం కాదని లోకేశ్ హెచ్చరించారు.
రెండు రోజుల్లో నన్ను అరెస్టు చేస్తారు : చంద్రబాబు
సీఎం జగన్మోహన్రెడ్డి పాలనలో అన్నీ అరాచకాలేనని టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు అనంతపురం జిల్లా రాయదుర్గంలో ధ్వజమెత్తారు. వైసీపీ నేతల ఇసుక దోపిడీకి అడ్డూఅదుపూ లేకుండా పోయిందని, ప్రశ్నించిన వారిపై దాడులకు దిగుతున్నారని, తనను కూడా రేపో, ఎల్లుండో అరెస్టు చేయెచ్చని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. వైసీపీ నేతలు ప్రజల, ప్రభుత్వ ఆస్తులు కొల్లగొడుతున్నారని చంద్రబాబు మండిపడ్డారు. వైసీపీ నేతల ఇసుక దోపిడీపై జాతీయ హరిత ట్రిబ్యునల్‌లో ఫిర్యాదు చేసిన నాగేంద్ర అనే వ్యక్తిపై అక్రమ కేసులు పెట్టి జైల్లో పెట్టారని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు.
రాహుల్ గాంధీకి యూపీ కోర్టు సమన్లు