ఢిల్లీ వేదికగా ఈ నెల 9,10వ తేదీల్లో జరగనున్న జీ20 సమావేశాల ప్రభావం ప్రజా రవాణాపై తీవ్రంగా పడింది. జీ20 సమావేశాల ముందు రోజు నుంచే ఢిల్లీ నుంచి రాకపోకలు సాగించే దాదాపు 160 దేశీయ విమాన సర్వీసులు రద్దు చేసే అవకాశం ఉందని ఏవియేషన్ అధికారులు వెల్లడించారు. ఢిల్లీకి వచ్చే 80 విమానాలతోపాటు, ఢిల్లీ నుంచి బయలు దేరే మరో 80 విమాన సర్వీసులు రాబోయే మూడు రోజుల్లో రద్దు కానున్నాయి.
జీ20 సమావేశాలకు 40 దేశాల నుంచి ప్రతినిధులు హాజరుకానున్నారు. ఆయా దేశాల ప్రతినిధుల విమానాలు దిగేందుకు వీలుగా దేశీయ విమాన సర్వీసులను రద్దు చేయనున్నట్టు అధికారులు ప్రకటించారు. జీ20 సదస్సుకు సంబంధించి అన్ని ముందు జాగ్రత్త చర్యలు తీసుకున్నట్టు ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం అధికారులు చెప్పారు.
ఈ నెల 8 నుంచే మూడు రోజుల పాటు అనేక విమాన సర్వీసులు రద్దు కానుండటంతో వేలాది మంది ప్రయాణీకులు తమ స్టేటస్ చెక్ చేసుకోవాలని విస్తారా ఎయిర్లైన్స్ ఎక్స్ వేదికగా కోరింది. టికెట్ రద్దు చేసుకున్న ప్రయాణీకులపై ఎయిరిండియా అదనపు ఛార్జీలను రద్దు చేసింది. ఈ నెల 8వ తేదీ నుంచి 11 వరకు ఢిల్లీ విమానాశ్రయానికి వచ్చే ప్రయాణీకులు ముందుగా చేరుకోవాలని, చెక్ ఇన్ కౌంటర్లు విమానం బయలు దేరే గంట ముందుగా మూసివేయనున్నట్టు ప్రకటించారు.
రాహుల్ గాంధీకి యూపీ కోర్టు సమన్లు