సనాతన ధర్మం గురించి ప్రఖ్యాత సామాజికవేత్త, ప్రముఖ
కార్డియాలజిస్ట్ డాక్టర్ బి ఎం హెగ్డే ఏమన్నారంటే…
భారతీయ తత్వశాస్త్రం అంటే హిందూ తత్వశాస్త్రం
కాదు. అసలు హిందూ అనే మతమే లేదు. ఇక్కడ ఉన్నది సనాతన ధర్మం మాత్రమే. దాని వయసు
లెక్కకట్టలేం. ప్రతీ ఒక్కరూ ఈ ధర్మాన్ని పాటించవచ్చు. ఒక ముస్లిమైనా, ఒక క్రైస్తవుడైనా సనాతన ధర్మాన్ని
అనుసరించవచ్చు. ఈ ధర్మం ఎవరో ఒక దేవుడికి చెందినది కాదు. అసలు వేదాలే దేవుడి
గురించి మాట్లాడవు. అవి సూర్యుడిని, అగ్నిని, వాయువును పూజించాయి. భగవంతుడు అనే
శక్తిని నేను చూడలేను కాబట్టి ఆయన సృజించిన శక్తులను ప్రార్థిస్తున్నాను. అందులో
తప్పేముంది? నిజానికి ఆ ప్రార్థనలోని అందమే అది. అసలు సనాతన ధర్మం ఏం చెబుతుంది? ఆ
విషయాన్ని సంక్షిప్తం చేసి మహాభారతంలో చెప్పారు. మహాభారతం అనేది భారతదేశపు
ఇతిహాసం. దాని దరిదాపుల్లోకి వచ్చే గ్రంథమే లేదు. హోమర్, ఇలియడ్.. ఏవీ భారతానికి
సాటి రావు. మహాభారతానికి రాజగోపాలాచారి చాలా అందమైన వ్యాఖ్యానం రాసారు. ‘‘అందులో
లేనిది ఎక్కడా లేదు.’’ అంతే. ఒకే ఒక వాక్యం. అంటే, మహాభారతమే సర్వస్వం అన్నమాట. ఇలియడ్
కానీ, ఒడెస్సీ కానీ, మహాభారతం కానీ అన్నీ ఒక మహిళ గురించి జరిగిన యుద్ధాలే. కానీ
భారతీయ సంస్కృతిని చూడండి. హోమర్ ఇలియడ్లో ఆ యువతి శత్రువుతో పారిపోతుంది. కానీ
మన గ్రంథాలు చూడండి. సీత తన భర్తను చేరుకుంటుంది, పార్వతి తన భర్తను చేరుకుంటుంది.
అదీ తేడా. నా స్నేహితుడు ఒకమాట చెప్పేవాడు. డాక్టర్, మొత్తం మహాభారతం ఎందుకు
చదువుతారు. కేవలం రెండు వాక్యాలు చదవండి. ఏమిటవి. ధర్మక్షేత్రే కురుక్షేత్రే.
దాన్ని కొద్దిగా మార్చండి. క్షేత్రే క్షేత్రే ధర్మం కురుః. జీవితంలో ఎల్లప్పుడూ
ధర్మాన్నే ఆచరించమని చెబుతున్నాడు. ధర్మం అనేది మతం కాదు, అది సమాజం పట్ల మన
బాధ్యత. ఆ బాధ్యతను మనం పరిపూర్తిగా చేయగలిగితే మీరంతా ఆరోగ్యంగా ఉంటారు.