తమిళనాడు రాష్ట్ర మంత్రి, ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి
కుమారుడు అయిన ఉదయనిధి స్టాలిన్, సనాతన ధర్మాన్ని కించపరిచేలా వ్యాఖ్యలు చేయడాన్ని
విశ్వహిందూ పరిషత్ తీవ్రంగా ఖండించింది. ఉదయనిధిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని
డిమాండ్ చేసింది. ఆంధ్రప్రదేశ్‌లో మతమార్పిడులు పెద్దసంఖ్యలో జరుగుతున్నాయని
విశ్వహిందూ పరిషత్ ఆందోళన వ్యక్తం చేసింది. వాటిని అరికట్టడం కోసం
రాష్ట్రప్రభుత్వం తక్షణమే యాంటీ కన్వర్షన్ బిల్లు తీసుకురావాలని డిమాండ్ చేసింది.
విశ్వహిందూ పరిషత్ జాతీయ నాయకులు, సెంట్రల్
సెక్రెటరీ జనరల్ మిలింద్ పరాండే విజయవాడలో మంగళవారం నాడు మీడియాతో సమావేశమయ్యారు. సమీప
భవిష్యత్తులో సంస్థ చేయబోయే కార్యక్రమాల గురించి వివరించారు.
అయోధ్యలో రామమందిర నిర్మాణం పూర్తవుతోందని, 2024 సంక్రాంతి
పండుగ తర్వాత, అంటే జనవరి 16-24 మధ్య, మూలవిరాట్టుల ప్రతిష్టాపన మహోత్సవం
జరుగుతుందని మిలింద్‌జీ చెప్పారు. ప్రపంచంలోని హిందువులంతా గర్వించే విధంగా
ప్రతిష్టాపన కార్యక్రమం కన్నుల పండువగా జరుగుతుందని వివరించారు.
దేశ యువతలో దేశభక్తి, దైవభక్తి పెంపొందించడానికి
విశ్వహిందూ పరిషత్ దేశవ్యాప్తంగా బజరంగ్దళ్ శౌర్య జాగరణ యాత్ర చేపట్టనుంది. యువతను
వ్యసనాలకు లోనుకాకుండా ప్రేరణ కలిగించడం, స్వతంత్ర సమర పోరాటంలో అమర వీరుల
త్యాగాలను స్మరించుకోవడం, వారి శౌర్యాన్ని, ధైర్య స్థైర్యాలనూ అలవరచుకునేలా యువతను
ప్రోత్సహించడమే లక్ష్యంగా ఆ యాత్ర జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్‌లో 80శాతం గ్రామాలకు ఆ
యాత్ర చేరేలా యోజన రూపొందించినట్టు మిలింద్‌జీ చెప్పారు.
విశ్వహిందూ పరిషత్ సంస్థను స్థాపించి 60 సంవత్సరాలు
పూర్తవుతున్న సందర్భంగా దేశమంతటా షష్ట్యబ్ది మహోత్సవాలు నిర్వహిస్తామని మిలింద్‌జీ
చెప్పారు. ప్రస్తుతం 76వేలు ఉన్న కమిటీలను లక్షకు పెంచడం, 72లక్షల మంది సభ్యుల
సంఖ్యను కోటికి చేర్చడం, దేశవ్యాప్తంగా ఉన్న 4500 సేవా ప్రకల్పాల సంఖ్యను, 400
సేవాయుక్త జిల్లాల సంఖ్యను రెట్టింపు చేయాలని లక్ష్యంగా నిర్ణయించుకున్నారు.
వచ్చే దీపావళికి ముందు దేశవ్యాప్తంగా ధర్మాచార్య
యాత్రలు నిర్వహించనున్నట్లు మిలింద్‌జీ వెల్లడించారు. హిందూ జాగరణ, సమరసతా భావనను
సాధించడం, కుటుంబ ప్రబోధం, మత మార్పిడుల పట్ల జాగరణ కలిగించే ఉద్దేశంతో
ధర్మాచార్యులు ఈ యాత్రలు నిర్వహిస్తారు.
తిరుమల తిరుపతి దేవస్థానాల చైర్మన్‌గా
నాస్తికుడినని చెప్పుకునే క్రైస్తవ మతావలంబి భూమన కరుణాకర రెడ్డిని నియమించడం
ఇటీవలి కాలంలో రాష్ట్రంలో చర్చనీయాంశమైంది. అలాగే టీటీడీ ట్రస్ట్ బోర్డ్‌లో సభ్యుల
ఎంపిక కూడా వివాదాస్పదమైంది. ఆ నేపథ్యంలో ఆలయ కమిటీల నియామకాలపై విహెచ్పీ
స్పందించింది. ఆర్థిక కుంభకోణాల్లో ఉన్నవారిని, అవినీతి ఆరోపణలు ఉన్నవారిని,
నేరచరిత్ర కలిగిన వారిని కమిటీల్లో నియమించరాదని డిమాండ్ చేసింది. దైవమంటే
భక్తిభావం, సమాజమంటే శ్రద్ధాసక్తులు కలిగిన వారిని మాత్రమే కమిటీలలో నియమించాలని
విశ్వహిందూ పరిషత్ కోరింది.
భక్తుల భద్రత విషయంలో టీటీడీ సమర్ధమైన చర్యలు
తీసుకోవాలని పరిషత్ కోరింది. భక్తుల దర్శనాలకు ఆటంకం కలిగించకుండా, లేదా దర్శనాలను
నిలువరించకుండా వారికి భద్రత కల్పించే విధంగా టీటీడీ సరైన నిర్ణయాలు తీసుకోవాలని
విశ్వహిందూ పరిషత్ డిమాండ్ చేసింది.
ఇక హిందూ దేవాలయాల విషయంలో అతి ప్రధానమైన నిర్వహణ
అంశం గురించి కూడా విశ్వహిందూ పరిషత్ స్పందించింది. దేవాలయాలకు పూర్తిస్థాయిలో స్వయంప్రతిపత్తి
కలిగించాలని, వాటి నిర్వహణ బాధ్యతలను పూర్తిగా హిందువులకు అప్పగించాలని డిమాండ్
చేసింది. అంతవరకూ దేవాలయాల ఆస్తులు, ఆదాయాలను కేవలం హిందువుల కోసం, హిందూ ధర్మ
ప్రచారం కోసమే ఖర్చు పెట్టాలని కోరింది. దేవాలయ ఉద్యోగాలు, దేవాలయాల్లో దుకాణాల
నిర్వహణ బాధ్యతలు హిందువులకు మాత్రమే కేటాయించాలని విశ్వహిందూ పరిషత్ డిమాండ్
చేసింది.
ఈ కార్యక్రమంలో
విశ్వహిందూ పరిషత్ ఆంధ్రప్రదేశ్ నేతలు వై. రాఘవులు, వి, శ్రీవెంకటేశ్వర్లు, టి,ఎస్
రవికుమార్, దుర్గాప్రసాద్ రాజు, సుబ్బరాజు, సానా శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.