జీ20 సమావేశాలకు అతిధుల ఆహ్వాన పత్రికపై ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా పేరును ప్రెసిడెంట్ ఆఫ్ భారత్‌గా ముద్రించిన అంశం వివాదానికి దారితీసిన సంగతి తెలిసిందే. తాజాగా ప్రధాని నరేంద్ర మోదీ ఇండోనేషియా పర్యటనకు సంబంధించిన పత్రంపై ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ భారత్‌గా ముద్రించడం పేరు మార్పు వివాదానికి ఆజ్యం పోసినట్టైంది.
బుధ, గురువారాల్లో ప్రధాని మోదీ ఇండోనేషియాలో జరుగుతోన్న ఆసియన్ ఇండియా సమావేశాలతోపాటు, తూర్పు ఆసియా సదస్సుకు కూడా హాజరవుతున్నారు. ఇందుకు సంబంధించిన అధికారిక పత్రంపై ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ భారత్ అని ముద్రించడం మరోసారి వివాదానికి దారితీసింది.
తాజాగా ముద్రించిన పత్రాన్ని బీజేపీ అధికార ప్రతినిధి సంబిత్ పత్రా ఎక్స్‌లో పోస్ట్ చేశారు. వెంటనే కాంగ్రెస్ నేతలు విమర్శలు గుప్పించారు. ఆసియన్ ఇండియా సమ్మిట్, ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ భారత్ అని ఒకే పత్రంలో రెండింటినీ ముద్రించారని తప్పుపట్టారు. మోదీ ప్రభుత్వం ఎంత గందరగోళంలో పడిందో చూడండి. ప్రతిపక్ష కూటమి ఒక్కతాటిపైకి వచ్చి ఇండియా అని పిలుచుకున్నందుకే ఈ డ్రామా ఆడుతున్నారంటూ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి జైరామ్ రమేష్ ఎక్స్‌లో ట్వీట్ చేశారు.
ఈనెల 18 నుంచి 22 వరకు ఐదు రోజుల పాటు పార్లమెంటు ప్రత్యేక సమావేశాలు ఉంటాయంటూ ప్రకటించడం, ఎలాంటి ఎజెండా తెలపకపోవడంతో ముందుగా జమిలి ఎన్నికలు వస్తాయంటూ ప్రచారం సాగింది. తాజాగా ప్రెసిడెంట్ ఆఫ్ భారత్ అంటూ జీ20 ఆహ్వానపత్రాలపై ముద్రించడంతో ఇండియా పేరు తొలగించి భారత్ పేరు శాశ్వతం చేయాలని చూస్తున్నారంటూ 28 పార్టీల ఇండియా కూటమి నేతలు తీవ్ర విమర్శలు చేస్తున్నారు.
రాహుల్ గాంధీకి యూపీ కోర్టు సమన్లు