ఇండియా పేరును శాశ్వతంగా భారత్‌గా మార్చనున్నారనే ఊహాగానాలపై ప్రతిపక్ష నేతలు విరుచుకుపడుతున్నారు. జీ20 సదస్సుకు హాజరయ్యే విదేశీ నేతల అధికారిక ఆహ్వాన పత్రికలో ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా స్థానంలో ప్రెసిడెంట్ ఆఫ్ భారత్ అని ప్రచురించడం వివాదానికి దారితీసింది. ప్రతిపక్ష కాంగ్రెస్ కూటమిలోని 28 పార్టీలు ఇండియా అని పేరు పెట్టుకున్న సంగతి తెలిసిందే. అందుకే ఇండియా పేరును మారుస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి.
బీజేపీ తీరుపై ఢిల్లీ సీఎం, ఆప్ అధ్యక్షుడు కేజ్రీవాల్ తీవ్ర విమర్శలు చేశారు. ఇండియా కూటమి పేరును భారత్ అని మార్చుకుంటే భారత్ పేరును బీజేపీగా మారుస్తారా? అంటూ ఆయన ప్రశ్నించారు. దేశం అనేది ఒక రాజకీయ పార్టీకి చెందింది కాదంటూ ఆప్‌కు చెందిన సీనియర్ నేత రాఘవ్ చద్దా బీజేపీ నేతలపై విరుచుకుపడ్డారు.
ఈ వివాదంపై పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీ తనదైన శైలిలో స్పందించారు. ఇండియా పేరు మార్చబోతున్నారని తెలుస్తోంది. ప్రపంచం మొత్తానికి భారతదేశం అని తెలుసు, దీని తరవాత రవీంద్రనాథ్ టాగోర్ పేరుకు కూడా మారుస్తారా అంటూ ఆమె ప్రశ్నించారు.
తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ ఇండియా పేరు మార్పు ఊహాగానాలపై స్పందించారు. తాము అధికారంలోకి వస్తే భారతదేశాన్ని మారుస్తామని బీజేపీ హామీ ఇచ్చిందని, తొమ్మిదేళ్ల పాలన తరవాత కేవలం దేశం పేరును మాత్రమే మార్చే ప్రయత్నం చేస్తున్నారని స్టాలిన్ ఎద్దేవా చేశారు. బీజేపీయేతర శక్తులన్నీ ఏకమై మతతత్వ పార్టీని గద్దె దించేందుకు ఇండియా కూటమిగా ఏర్పడిన తరవాత దేశం పేరును భారత్‌గా మార్చాలనుకుంటున్నారని విమర్శించారు. విపక్షాల బలాన్ని గుర్తించారని, అందుకే ఇండియా అనే పదాన్ని కొట్టేయాలని చూస్తున్నారని, వచ్చే ఎన్నికల్లో ఇండియా కూటమి బీజేపీని ఓడిస్తుందని స్టాలిన్ ధ్వజమెత్తారు.
రాహుల్ గాంధీకి యూపీ కోర్టు సమన్లు