సెప్టెంబర్ 9న జరగబోయే జి-20 దేశాధినేతల విందు
కోసం రాష్ట్రపతి భవన్ రూపొందించిన ఆహ్వాన పత్రిక మీద ‘ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా’ అని
కాకుండా ‘ప్రెసిడెంట్ ఆఫ్ భారత్’ అని ముద్రించడం రాజకీయ రగడకు దారి తీసింది. దేశం
పేరును భారత్ అని మార్చేయడం ద్వారా రాష్ట్రాల కూటమి అన్న భావనను కేంద్రం
దెబ్బతీస్తోందని కాంగ్రెస్ మండిపడుతోంది.
కాంగ్రెస్ నాయకుడు జైరాం రమేష్ ప్రధానమంత్రి
నరేంద్రమోదీ చరిత్రను వక్రీకరిస్తూ, భారతదేశాన్ని విభజిస్తున్నారని మండిపడ్డారు.రాజ్యాంగంలోని మొదటి అధికరణం ‘ఇండియా దటీజ్ భారత్’
అని చెబుతూ అది కొన్ని రాష్ట్రాల కూటమి అని వివరిస్తోందని జైరాం రమేష్ చెప్పారు. దాన్ని
ఇకపై ‘భారత్ దట్ వజ్ ఇండియా’గా మార్చేస్తారేమోనని ఆందోళన వ్యక్తం చేసారు. తద్వారా
ఈ దేశం రాష్ట్రాల కూటమి అనే భావనను కేంద్ర ప్రభుత్వం దెబ్బతీస్తోందని మండిపడ్డారు.
‘‘బైట వినిపిస్తున్న వార్తలు నిజమేనన్నమాట. రాష్ట్రపతి
భవన్ సెప్టెంబర్ 9న ఇవ్వబోయే విందు ఆహ్వాన పత్రికలో ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా బదులు
ప్రెసిడెంట్ ఆఫ్ భారత్ అని ముద్రించారు. ఇంక నుంచీ రాజ్యాంగంలోని మొదటి అధికరణం ‘భారత్
దట్ వజ్ ఇండియా’గా మారిపోతుంది. ఇప్పుడిక దేశంలోని రాష్ట్రాల మీద దాడికి దిగారు.’’
అని జైరాం రమేష్ ట్వీట్ చేసారు.
దేశంలోని 26 పార్టీలు కలిపి ఏర్పాటు చేసిన
కూటమికి ఐఎన్‌డిఐ కూటమి అని పేరు పెట్టారనీ, దాన్ని వాడుకలో లేకుండా చేయడానికే
ఇప్పుడు భారత్ అంటున్నారనీ జైరాం వ్యంగ్యంగా అన్నారు. ఐఎన్డీఐఏ కూటమిని
లక్ష్యాలను కుదిస్తే వచ్చే పదం భారత్ అని వ్యాఖ్యానించారు. ‘బ్రింగ్ హార్మొనీ,
ఎమిటీ, రీకన్సీలియేషన్ అండ్ ట్రస్ట్‘ అనే పదానికి హ్రస్వరూపమే భారత్ అని జైరాం
రమేష్ అన్నారు. ‘భారత్ జోడిస్తుంది – ఇండియా గెలుస్తుంది’ అని ఆయన
అభిప్రాయపడ్డారు.
బీజేపీ నాయకులు మాత్రం ‘భారత్’ అన్న పదం
వాడడాన్ని సమర్థిస్తున్నారు, స్వాగతిస్తున్నారు. భారత్ అన్న పదాన్ని వాడుకలోకి
తేవాలని బీజేపీ ప్రయత్నిస్తోంది. ఇండియా అన్న పేరు మన దేశాన్ని దోచుకోడానికి
వచ్చిన బ్రిటిష్ వారు పెట్టిన పేరు. అలా కాకుండా, భారత్ అన్న పేరు మన సంస్కృతిని
సూచిస్తుంది. ఆ మేరకు రాజ్యాంగాన్ని సవరించవచ్చునని వారు చెబుతున్నారు.
దేశం పేరును భారత్‌గా మారుస్తారన్న ఊహాగానాలతో బీజేపీవర్గాలు సంబరపడుతున్నాయి. రాజ్యాంగంలో ‘ఇండియా’ అన్న పదానికి బదులు
భారత్ అనే పదం ఉండాలని వారు భావిస్తున్నారు. బీజేపీ ఎంపీ హరనాథ్ సింగ్ యాదవ్ ఈ
విషయమై మాట్లాడుతూ ఇండియా అనే పేరు బదులు ‘భారత్’ అన్న పదం వాడాలని యావద్దేశమూ
కోరుకుంటోందన్నారు. ఇండియా అనేది మన దేశాన్ని నిందించడానికి బ్రిటిష్ వారు పెట్టిన
పేరు అని, భారత్ అనేది మాత్రం మన సంస్కృతికి చిహ్నమనీ ఆయన అన్నారు. రాజ్యాంగానికి
ఏదైనా మార్పు చేయడానికి తనకు అవకాశం వస్తే, దేశం పేరును భారత్‌గా మారుస్తాను అన్నారు.
అస్సాం ముఖ్యమంత్రి హిమంత
బిస్వ శర్మ భారత్ పదానికి అనుకూలంగా ట్వీట్ చేసారు. ‘‘ ‘రిపబ్లిక్ ఆఫ్ భారత్’…
మన నాగరికత అమృతకాలం వైపు ధైర్యంగా పరుగులు తీస్తోందని చెప్పడానికి చాలా సంతోషంగా,
గర్వంగా ఉంది’’ అని ఎక్స్‌లో రాసుకొచ్చారు.
రాహుల్ గాంధీకి యూపీ కోర్టు సమన్లు