తమిళనాడు మంత్రి,
కరుణానిధి మనవడు అయిన ఉదయనిధి స్టాలిన్ తన ప్రకటన మీద హిందూ సమాజం వ్యక్తం చేస్తున్న
ఆగ్రహాన్ని సైతం అవహేళన చేస్తున్నారు. ఉదయనిధి తల తరిగి తెచ్చిన వారికి పది కోట్లు
ఇస్తామని ఒక సాధువు చేసిన ప్రకటనను కొట్టిపడేసారు. తన తలకు పదిరూపాయల దువ్వెన
చాలంటూ జోక్ చేసినట్టు మాట్లాడుతూ సనాతన హిందువులను మళ్ళీ రెచ్చగొడుతున్నారు.
‘‘సనాతన ధర్మం డెంగీ,
మలేరియా లాంటిది. దాన్ని సమూలంగా నిర్మూలించాల్సిందే’’ అని ఉదయనిధి స్టాలిన్ ఇటీవల
చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా హిందువులను ఆగ్రహానికి గురి చేసాయి. ఆ ఆగ్రహంలోనే
ఉత్తరప్రదేశ్ అయోధ్యలోని తపస్వి చావ్ని ఆలయం ప్రధాన పూజారి పరమహంస ఆచార్య పెద్ద
ప్రకటనే చేసారు. ‘‘(ఉదయనిధి) స్టాలిన్ తల నరికి తెచ్చి ఇచ్చిన వారికి పది కోట్ల
రూపాయల నగదు బహుమతి ఇస్తాను. అతన్ని చంపడానికి ఎవరూ ధైర్యం చేయకపోతే, నేనే అతను ఎక్కడున్నాడో
కనిపెట్టి అతన్ని చంపేస్తాను’’ అని స్పందించారు.
యూపీ పూజారి చేసిన
వ్యాఖ్యలు తనను భయపెట్టలేవని, అలాంటి కాకమ్మ కబుర్లకు ఆందోళన చెందననీ ఉదయనిధి
స్టాలిన్ స్పష్టం చేసారు. ఉదయనిధి చెన్నైలో ఒక కార్యక్రమంలో మాట్లాడుతూ ‘‘సనాతనం
గురించి మాట్లాడినందుకు నా తల గొరిగిన వారికొక పది కోట్లు ఇస్తామని ప్రకటించారు.
నిజానికి నా తల దువ్వడానికి పది రూపాయల దువ్వెన సరిపోతుంది’’ అంటూ వేళాకోళంగా
మాట్లాడారు ఉదయనిధి. అంతే తప్ప, యావత్ హిందూ సమాజం కోరుకుంటున్నట్టు క్షమాపణలు
మాత్రం చెప్పడం లేదు. ఉదయనిధి అరాచకానికి ఇదే నిదర్శనం.
తమిళ భాషలో నరకడం అన్న
పదానికి, దువ్వడం అన్న పదానికి ఒకే తమిళ పదం ఉంది. దాన్ని అడ్డు పెట్టుకుని ఉదయనిధి
మళ్ళీ మాట్లాడాడు. ‘‘ఇలాంటి బెదిరింపులు మనకు కొత్తేమీ కాదు. మనం ఇలాంటి
బెదిరింపులకు భయపడిపోయే వాళ్లం కాదు. తమిళం కోసం రైలు పట్టాల మీద తల పెట్టిన
కళాకారుడి మనవడిని. ఇలాంటి ఉత్తుత్తి బెదిరింపులకు భయపడే వాణ్ణి కాను నేను’’
అన్నారు ఉదయనిధి.
సనాతన ధర్మాన్ని నిర్మూలించాలన్న
ఉదయనిధి వ్యాఖ్యలు ఆ ధర్మాన్ని అనుసరించేవారిని సామూహిక జనహననం చేయాలి అన్నట్టేనని
బీజేపీ మండిపడింది. దేశవ్యాప్తంగా ఉదయనిధి వ్యాఖ్యలు దుమారం రేపాయి. వాటిని
ఉపసంహరించుకోవాలని పలు హిందూ సంస్థలు డిమాండ్ చేసాయి. ఆ నేపథ్యంలో ఉదయనిధి తన
వ్యాఖ్యల పదును ఇంకా పెంచారు.
‘‘ప్రధానమంత్రి నరేంద్ర
మోదీ కాంగ్రెస్ ముక్త భారత్ గురించి మాట్లాడుతుంటారు. అంటే దానర్థం కాంగ్రెస్
సభ్యులను చంపేయాలనా? కాదు కదా. మనం ఒక సిద్ధాంతం గురించి మాట్లాడుతున్నాం. అసలు
సనాతన ధర్మం అంటే ఏమిటి? అది శాశ్వతమని, ఏ మార్పూ లేనిదని చెబుతారు. మన ద్రవిడ
నమూనా మార్పు గురించి చెబుతుంది. వాళ్ళు కొన్నేళ్ళ క్రితం మహిళలను చదవద్దు
అన్నారు. చాలా ఏళ్ళ క్రితం వాళ్ళు మహిళలు తమ ఛాతీ పైభాగాన్ని కప్పుకోకూడదన్నారు,
వారిని ఆలయాల్లోకి రావద్దన్నారు. మనం ప్రతీ దాన్నీ మార్చేసాం. అదీ ద్రవిడ నమూనా
అంటే.’’ అంటూ ఉదయనిధి మరింత రెచ్చిపోయారు.
ఇప్పటికే జరిగిన గొడవని చల్లార్చాల్సిన ఉదయనిధి ఆ
పని చేయలేదు. తన తాజా వ్యాఖ్యలతో సనాతన హిందూ సమాజంపై తన అక్కసును మరోసారి
వెళ్ళగక్కారు. తప్పుడు ఆరోపణలతో మళ్ళీ విద్వేష విషం వెదజల్లారు.