సూర్యునిపై పరిశోధనలకు ఇస్రో ప్రయోగించిన ఆదిత్య-ఎల్1 ఉపగ్రహ కక్ష్యను రెండో సారి విజయవంతంగా పెంచారు. ప్రస్తుతం 40225 కి.మీ కక్ష్యలోకి ఉపగ్రహాన్ని ప్రవేశపెట్టినట్టు ఇస్రో ప్రకటించింది. బెంగళూరులోని ఇస్రో ప్రధాన కార్యాలయం నుంచి ఆదిత్య-ఎల్1 కక్ష్యను పెంచినట్టు తెలిపారు. మారిషస్, బెంగళూరు, పోర్ట్బ్లెయిర్లోని ఇస్రో కేంద్రాల నుంచి ఆదిత్య-ఎల్1ను ట్రాక్ చేసినట్టు ఇస్రో వెల్లడించింది. ఆదివారం నాడు మొదటి సారి ఆదిత్య-ఎల్1 కక్ష్యను విజయవంతంగా పెంచారు. తాజాగా ఇవాళ మరోసారి కక్ష్యను పెంచారు. సెప్టెంబరు 10వ తేదీన మూడోసారి కక్ష్యను పెంచనున్నట్టు ఇస్రో శాస్త్రవేత్తలు తెలిపారు.
సూర్యుని గురించి అధ్యయనం చేయడానికి భారత్ ప్రయోగించిన మొదటి ఉపగ్రహం ఆదిత్య-ఎల్1 విజయవంతంగా ప్రయాణిస్తోంది. భూమి నుంచి 15 లక్షల కి.మీ దూరం ఈ ఉపగ్రహం ప్రయాణించాల్సి ఉంది. చంద్రయాన్- 3 విజయవంతం తరవాత ఇస్రో చేపట్టిన ఆదిత్య-ఎల్1 ఉపగ్రహ ప్రయోగం ప్రపంచ దేశాల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది.