‘సనాతన ధర్మం వైరస్ లాంటిది, దాన్ని
నిర్మూలించాలి’ అని డీఎంకే నేత, తమిళనాడు మంత్రి ఉదయనిధి స్టాలిన్ చేసిన వ్యాఖ్యలు
దేశవ్యాప్త చర్చకు దారి తీసాయి. హిందూధర్మంపై నోరు పారేసుకున్న ఉదయనిధిపై భారతీయ
జనతా పార్టీ శ్రేణులు మండిపడుతున్నాయి. అదే సమయంలో, ఇండియా కూటమిలో డీఎంకేను కూడా
కలుపుకున్న కాంగ్రెస్ వైఖరి ఎలా ఉందని చూస్తే ఆశ్చర్యం కలుగుతుంది. ఆ పార్టీ
ఎప్పటిలానే కపట ద్వంద్వవైఖరితో నాలుక రకరకాలుగా మడతేస్తున్న తీరుతో సగటు హిందువుకు
ఒళ్ళు మండక మానదు.
కాంగ్రెస్ సీనియర్ నేత కేసీ వేణుగోపాల్ తమ పార్టీ
అందరి విశ్వాసాలనూ గౌరవిస్తుందని చెప్పారు. అలా అని ఊరుకోలేదు. ప్రతీ రాజకీయ
సంస్థకూ తమ భావాలను వెల్లడించే స్వేచ్ఛ ఉంటుందని సన్నాయి నొక్కులు నొక్కారు. ఆ
రెండింటినీ సమన్వయం చేసుకోడానికా అన్నట్టు, సర్వధర్మ సమభావనే కాంగ్రెస్ సిద్ధాంతం
అని ఓ మాట అనేసారు. మిత్రపక్షం డీఎంకేని ఏమీ అనలేని, కూటమిలో బలమైన పక్షానికి
నేరుగా మద్దతు పలకలేని వేణుగోపాల్, ఆకుకు అందని పోకకు చెందని వ్యాఖ్యలు చేసారు.
మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కమల్నాథ్ కొంచెం
జాగ్రత్త పడ్డారు. ఆ ప్రకటన వల్ల కలగగల రాజకీయ ముప్పును కమల్నాథ్ బాగానే అంచనా
వేసారు. అందుకే తెలివిగా మాట్లాడారు. ‘‘బహుశా అవి అతని సొంత వ్యక్తిగత
అభిప్రాయాలు, వాటితో నేను ఏకీభవించను’’ అన్నారు. కొద్దివారాల్లో మధ్యప్రదేశ్
రాష్ట్ర శాసనసభకు ఎన్నికలు జరగనున్నాయి మరి.
తమిళనాడుకు పొరుగున ఉన్న కర్ణాటక మంత్రి మాత్రం నేరుగానే
సమర్థించారు, కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కుమారుడు
ప్రియాంక్ ఖర్గే, హిందూమతంలోని అవగుణాలను మాత్రమే ఉదయనిధి విమర్శించారంటూ వెనకేసుకుని
వచ్చే ప్రయత్నం చేసారు. ప్రజలకు సమాన హక్కులు ఇవ్వని మతం రోగంతో సమానం అన్నారు. ‘‘సమానత్వాన్ని
ప్రచారం చేయని ఏ మతమైనా, మనిషిని మనిషిలా చూడని ఏ మతమైనా, నా ఉద్దేశంలో మతమే కాదు.
అందరికీ సమాన హక్కులు ఇవ్వని ఏ మతమైనా రోగంతో సమానం’’ అని వ్యాఖ్యానించారు. సనాతన
హిందూమతం ప్రజలను సమానంగా ఆదరించదనీ, ఆ మతం రోగంతో సమానమేననీ వ్యాఖ్యలు చేస్తూ ప్రియాంక్
ఖర్గే ఉదయనిధికి అండగా నిలిచారు.
ఇండియా కూటమిలోని ప్రధాన పార్టీ అయిన కాంగ్రెస్,
మరో పెద్ద పార్టీ అయిన డీఎంకే కీలక నేత చేసిన వ్యాఖ్యలను ఒప్పుకోడానికి వెనుకాడడం
లేదు. అయితే హిందువుల ఓట్లు పోతాయన్న ఆందోళనతో అక్కడక్కడా మృదువుగా నటిస్తోంది.
హిందూమతంలోని కొన్ని లోపాలను మాత్రమే డీఎంకే నేత ఖండించారనే అర్ధం వచ్చేలా
కాంగ్రెస్ నేతలు మాట్లాడుతున్నారు. నోటి మాట ఒకటి, కానీ దాని భావం మరొకటి. ఇలాంటి
కపట ద్వంద్వ వైఖరితో కాంగ్రెస్ నేతలు డీఎంకే హిందూద్వేషానికి మద్దతు
పలుకుతున్నారు.
రాహుల్ గాంధీకి యూపీ కోర్టు సమన్లు