చంద్రయాన్-3 ప్రయోగంలో కీలక భూమిక పోషించిన విక్రమ్ ల్యాండర్ నిద్రాణ స్థితిలోకి జారుకుందని ఇస్రో ప్రకటించింది. అంతర్జాతీయ కాలమానం ప్రకారం ఇవాళ ఉదయం 8 గంటలకు నిద్రాణంలోకి వెళ్లినట్టు ఇస్రో అధికారికంగా స్పష్టం చేసింది. విక్రమ్ ల్యాండర్‌లోని పేలోడ్స్‌ను కూడా ఆపివేసినట్టు శాస్త్రవేత్తలు చెప్పారు. విక్రమ్ ల్యాండర్ మరలా సెప్టెంబరు 22న నిద్రాణ స్థితి నుంచి బయట పడే అవకాశముందని అంచనా వేస్తున్నారు.
విక్రమ్ ల్యాండర్ పేలోడ్స్‌ను ఆపివేయగా, ల్యాండర్ రిసీవర్స్ మాత్రం ఆన్‌లో ఉంచారు. చంద్రునిపై థర్మో ఫిజికల్ ప్రయోగాలతోపాటు, అక్కడ వాతావరణం అంచనా వేసేందుకు చంద్రయాన్-3 మిషన్ చేపట్టారు. అందులో భాగంగానే విక్రమ్ ల్యాండర్ చంద్రుని ఉపరితలంపై ఆగష్టు 23న విజయవంతంగా దిగింది. గడచిన 12 రోజులుగా ఇస్రోకు ఫోటోలతో సహా, కీలక సమాచారం పంపించింది.
చంద్రయాన్-3 మిషన్ విజయవంతం కావడంతో చంద్రునిపై దిగిన నాలుగో దేశంగా భారత్ చరిత్ర సృష్టించింది. నాలుగేళ్ల కిందట ప్రయోగించిన చంద్రయాన్-2 విఫలమైనా, తాజా ప్రయోగంతో ఇస్రో శాస్త్రవేత్తలు అనుకున్న లక్ష్యం సాధించారు. చంద్రయాన్-3 మిషన్‌లో భాగంగా చంద్రునిపై దిగిన విక్రమ్ ల్యాండర్, ప్రజ్ఞాన్ రోవర్లు ఇస్రో అప్పగించిన పనిని విజయవంతంగా పూర్తి చేశాయి. ఇవి రెండూ ఒక లూనార్ డే పనిచేశాయి.