తమిళనాడు ముఖ్యమంత్రి ఎం.కె స్టాలిన్, ఆయన కొడుకు
ఉదయనిధి స్టాలిన్లపై బిహార్‌లో కేసు నమోదయింది. సనాతన ధర్మాన్ని అవహేళన చేస్తూ
వ్యాఖ్యలు చేసి, సనాతన ధర్మాన్ని నిర్మూలించాలంటూ ఉదయనిధి స్టాలిన్ మాట్లాడిన నేపథ్యంలో
ఈ కేసు నమోదయింది.
బిహార్‌లోని ముజఫర్‌పూర్‌కు చెందిన అడ్వొకేట్
సుధీర్ కుమార్ ఓఝా, చీఫ్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ పంకజ్ కుమార్ లాల్ వద్ద ఈ ఉదయం
పిటిషన్ దాఖలు చేసారు. ఉదయనిధి స్టాలిన్ చేసిన వ్యాఖ్యలు హిందువుల మనోభావాలను,
సెంటిమెంట్లను దెబ్బతీసేవిగా ఉన్నాయని ఆరోపిస్తూ ఆయన పిటిషన్ ఫైల్ చేసారు.
తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్, తమిళనాడు యువజన
సంక్షేమ శాఖ మంత్రి, డీఎంకే యువజన విభాగం కార్యదర్శి అయిన ఉదయనిధి స్టాలిన్లను
భారత శిక్షా స్మృతి కింద విచారించాలంటూ సుధీర్ కుమార్ ఓఝా పిటిషన్ దాఖలు చేసారు. ఈ
కేసు సెప్టెంబర్ 14న విచారణకు రానుంది.
ఉదయనిధి వ్యాఖ్యలపై దేశం నలుమూలలలోని బీజేపీ
శ్రేణులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. సనాతన ధర్మాన్ని నిర్మూలించాలన్న
ఉదయనిధి వ్యాఖ్యలు సామూహిక జన హననానికి పిలుపు అని కొందరు బీజేపీ నేతలు
మండిపడ్డారు. ఉదయనిధిని దేశద్రోహం కేసు పెట్టాలని మరికొందరు డిమాండ్ చేసారు. అయితే
తాను మాట్లాడింది కేవలం సమాజంలోని దుష్ట సంప్రదాయాలకు వ్యతిరేకంగా మాత్రమేనని
ఉదయనిధి తనను తాను సమర్ధించుకునే ప్రయత్నం చేసారు.
రాహుల్ గాంధీకి యూపీ కోర్టు సమన్లు