సనాతన
ధర్మంపై విపరీత వ్యాఖ్యలు చేసిన తమిళనాడు మంత్రి ఉదయనిధి స్టాలిన్ పై తెలుగురాష్ట్రాల
బీజేపీ నేతలు మండిపడుతున్నారు. ఓటుబ్యాంకు కోసం కాంగ్రెస్ దిగజారడంతోనే దాని మిత్రపక్షాల నేతలు ఇష్టానుసారం మాట్లాడుతున్నారని
ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఉదయనిధి
వ్యాఖ్యలు రాజ్యాంగ విరుద్ధమని మండిపడిన ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురందరేశ్వరి,
సనాతన ధర్మాన్ని విచ్ఛిన్నం చేయడమే విపక్షకూటమి లక్ష్యమన్నారు. కాంగ్రెస్ దాని
మిత్రపక్షాల చర్యలు హిందూ సమాజాన్ని ఆందోళనకు గురిచేస్తున్నాయన్నారు. I.N.DI.A అని పేరు పెట్టుకునే నైతికత విపక్ష
కూటమికి ఉందా అని ప్రశ్నించారు.
ఉదయనిధి
వ్యాఖ్యలను కాంగ్రెస్ ఎంపీ కార్తీ చిదంబరం సమర్థించడం ఆయన అవగాహనా రాహిత్యాన్ని
తెలియజేస్తుందని ఎద్దేవా చేసిన ఏపీ బీజేపీ అధ్యక్షురాలు, సనాతన ధర్మం అనేది ఓ జీవన
విధానమన్నారు.
మూర్ఖంగా
మాట్లాడే యువమంత్రికి, సనాతన ధర్మం ఆచరించే వారి ఓట్లు అక్కర్లేదని ప్రకటించే
దమ్ముందా అని తెలంగాణ బీజేపీ నేత, ఎంపీ లక్ష్మణ్ నిలదీశారు. మీ తల్లి, నానమ్మ
సనాతన ధర్మాన్ని పాటించారని మరి వాళ్ళను కూడా నాశనం చేస్తారా అని ప్రశ్నించారు. సెక్యులర్
ముసుగులో హిందూ వ్యతిరేకతను పెంచిన కాంగ్రెస్, మైనార్టీల ఓట్ల కోసం దిగజారే పార్టీ
అంటూ తూర్పారబట్టారు. సర్వేజనాః సుఖినోభవంతు అనే ధర్మాన్ని నాశనం చేస్తాననే మాటలు
వెనక్కి తీసుకుని క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. లేదంటే డీఎంకే తోపాటు
విపక్ష కూటమి దేశం మొత్తం మూల్యం చెల్లిస్తుందన్నారు.
చెన్నైలో
నిర్వహించిన రచయితల సమావేశంలో పాల్గొన్న మంత్రి ఉదయనిధి స్టాలిన్, ‘‘సనాతన ధర్మం
మలేరియా, డెంగీ లాంటి రోగం’’ అని అన్నారు. దానిని సమాజం నుంచి రూపుమాపాలని కోరారు.
సామాజిక న్యాయానికి వ్యతిరేకమైన భావాలు అందులో ఉన్నయన్నారు. దీనిపై బీజేపీ తీవ్ర
ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. హిందూ సమాజం పై విపక్ష కూటమి ద్వేషం వెదజల్లుతోందని
ఆగ్రహం వ్యక్తం చేసింది.