భారతదేశం మణిపూర్, హర్యానాలా కాకుండా ఉండాలంటే వచ్చే ఎన్నికల్లో ఇండియా కూటమి గెలవాలని తమిళనాడు సీఎం స్టాలిన్ అభిప్రాయపడ్డారు. సనాతన ధర్మాన్ని నిర్మూలించాలంటూ తమిళనాడు సీఎం స్టాలిన్ కుమారుడు మంత్రి ఉదయనిధి స్టాలిన్ చేసిన వ్యాఖ్యలపై దుమారం కొనసాగుతోంది. తనయుడు ఉదయనిధి చేసిన వ్యాఖ్యలను సీఎం స్టాలిన్ సమర్ధించుకున్నారు. తన కొడుకు చెప్పిన దాంట్లో ఒక్క అక్షరం ముక్క కూడా తప్పులేదని స్టాలిన్ అన్నారు. తొమ్మిదేళ్ల బీజేపీ పాలనలో ఇచ్చిన హామీ ఒక్కటి కూడా నెరవేర్చలేదని ఆయన ధ్వజమెత్తారు. కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వస్తే ఒక్కొక్కరి బ్యాంకు ఖాతాలో రూ.15 లక్షలు జమ చేస్తామన్నారు, రైతుల ఆదాయాలు రెట్టింపు చేస్తామన్నారు కానీ చేయలేదని స్టాలిన్ తీవ్ర స్థాయిలో విమర్శించారు.
భారతదేశం మణిపూర్, హర్యానాలా మారకుండా ఉండాలంటే ఇండియా కూటమి గెలివాలని స్టాలిన్ ఆకాంక్షించారు. ఈ ఏడాది మే నెల నుంచి ఈశాన్య రాష్ట్రం మణిపూర్ జాతి హింసతో రగిలిపోతోందని ఆయన ధ్వజమెత్తారు. ప్రభుత్వరంగ సంస్థలను, బీజేపీ అనుకూల బినామీలకు అప్పగించడం వంటి అంశాలను కప్పిపుచ్చడానికి మతోన్మాదాన్ని ఆశ్రయిస్తున్నారని స్టాలిన్ ఆరోపించారు. విమానాశ్రయాలు, ఓడరేవులను బీజేపీకి అనుకూలంగా ఉండే కార్పొరేట్ సంస్థలకు కట్టబెడుతున్నారని ఆయన విమర్శించారు.
సామాజిక న్యాయం, సామరస్యం, ఫెడరల్ వ్యవస్థ, లౌకిక విధానాల పునరుద్ధరణ కోసం ఇండియా కూటమి ఏర్పడిందని స్టాలిన్ గుర్తు చేశారు. బీజేపీని ఇప్పుడు అడ్డుకోకపోతే దేశాన్ని ఎవరూ రక్షించలేరని హెచ్చరించారు. సనాతన ధర్మాన్ని డెంగ్యూ, మలేరియా దోమలతో పోల్చి వాటిని నిర్మూలించాలంటూ మంత్రి ఉదయనిధి స్టాలిన్ చేసిన వ్యాఖ్యలపై హిందూ సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.
ఉదయనిధి స్టాలిన్ వ్యాఖ్యలపై తమిళనాడులో హిందూ సంఘాలు ఆందోళనకు దిగాయి. ఉదయనిధి వ్యాఖ్యలను పలువురు ఖండిస్తున్నారు. ఆయన గతంలో చర్చ్, స్వామీజీల వద్దకు వెళ్లి దిగిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసి, సమాధానం చెప్పాలంటూ డిమాండ్ చేస్తున్నారు. ఈ విషయంపై తమిళనాడు బీజేపీ నేతలు గవర్నర్కు ఫిర్యాదు చేశారు. ఉదయనిధిపై క్రిమినల్ కేసులు పెట్టేలా ఆదేశించాలని గవర్నర్కు వినతి పత్రం అందించారు. స్టాలిన్ తాజాగా చేసిన వ్యాఖ్యలతో కూడిన వీడియోను కూడా గవర్నర్కు అందించారు.
మంత్రి ఉదయనిధి వ్యాఖ్యలను నటుడు ప్రకాశ్ రాజ్ సమర్థించారు. సనాతన పార్లమెంటు భవిష్యత్తు ఇలా ఉంటుందా అంటూ మోదీ, స్వామీజీల ఫోటోలను ఆయన సోషల్ మీడియాలో షేర్ చేశారు.
రాహుల్ గాంధీకి యూపీ కోర్టు సమన్లు