ఈశాన్య
బంగాళాఖాతం పరిసరాల్లో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. సముద్ర మట్టానికి 5.8కిలోమీటర్ల
ఎత్తువరకు విస్తరించి ఉంది. దీని ప్రభావంతో మంగళవారం వాయవ్య
బంగాళాఖాతంలో పశ్చిమ మధ్య బంగాళాఖాతానికి
ఆనుకుని అల్పపీడనం ఏర్పడనుంది. మరోవైపు ఉపరితల ఆవర్తనం కొనసాగుతున్నాయి. నైరుతి
రుతుపవనాలు కోస్తాంధ్ర, రాయలసీమలపై బలంగా ఉన్నాయి. వీటన్నింటి ఫలితంగా నేటి నుంచి
మూడు రోజుల పాటు రాష్ట్రవ్యాప్తంగా అనేక చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు,
అక్కడక్కడా భారీ వర్షాల కురవనున్నాయి.
ఉత్తరాంధ్ర,
గోదావరి జిల్లాలు, కోస్తాంధ్రతో పాటు రాయలసీమ జిల్లాల్లో నేడు వానలు పడే అవకాశం
ఉందని భారతవాతావరణ శాఖ వెల్లడించింది. ఏలూరు, అల్లూరి సీతారామరాజు జిల్లాల్లో భారీ
నుంచి అతి భారీ వర్షాలు, విశాఖపట్నం, శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం,
కాకినాడ, విజయనగరం, అనకాపల్లి, తూర్పు, పశ్చిమ గోదావరి, కోనసీమ, పల్నాడు, గుంటూరు,
కృష్ణా జిల్లాల్లోనూ మోస్తరు వానలు మంగళవారం కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు
చెబుతున్నారు.
కోస్తాంధ్ర,
ఉత్తరాంధ్ర జిల్లాల్లో బుధవారం కూడా ఒకట్రెండు చోట్లు భారీ వర్షాలకు ఆస్కారం ఉందని
వివరించిన అధికారులు, అదే సమయంలో కొన్న ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులు కూడా
సంభవిస్తాయని తెలిపారు.
ఈశాన్య
బంగాళాఖాతంలోని ఆవర్తన ప్రభావంతో హైదరాబాద్ లో వర్షం దంచి కొడుతోంది. భారీవర్షం
కారణంగా నగరంలోని లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. మరో మూడురోజుల పాటు తెలంగాణ
వ్యాప్తంగా భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ ప్రకటించింది.
9 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్, 18 జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది.
ఒడిశాలో
శనివారం అసాధారణ రీతిలో పిడుగులు పడ్డాయి. కేవలం రెండు గంటల వ్యవధిలో
రాష్ట్రవ్యాప్తంగా సుమారు 61వేల పిడుగులుపడ్డాయి. ఈ ఘటనల్లో 12 మంది ప్రాణాలు
కోల్పోగా, 14 మంది గాయపడ్డారు. పిడుగుపాటు కారణంగా మరణించిన వారి కుటుంబానికి రూ.
4 లక్షల ఆర్థికసాయాన్ని ఆ రాష్ట్రప్రభుత్వం ప్రకటించింది.