చంద్రయాన్-3
ప్రయోగంలో భాగంగా జాబిల్లి దక్షిణ ద్రువంపై పరిశోధనలు చేసి విలువైన సమాచారాన్ని
అందించిన విక్రమ్ ల్యాండర్, ప్రజ్ఞాన్ రోవర్లు నిద్రాణ స్థితిలోకి వెళ్లాయి.
ఏపీఎక్స్ఎస్, లిబ్స్ పరికరాలను స్విచ్చాఫ్ చేసినట్లు పేర్కొన్నారు. ఈ రెండింటి
ద్వారా సమాచారం భూమికి చేరిందని ఇస్రో చైర్మన్ సోమనాథ్ వివరించారు.
చంద్రుడిపై రాత్రి సమయంలో
ఉష్ణోగ్రతలు మైనస్ డిగ్రీలోకి వెళతాయి. విక్రమ్ ల్యాండర్, ప్రజ్ఞాన్
రోవర్ రెండూ సౌరశక్తి ద్వారా మాత్రమే పనిచేస్తాయి. రాత్రి సమయంలో సౌరశక్తి అందదు
కాబట్టి వాటికి చార్జింగ్ అందదు.
వ్యోమనౌక
దిగిన శివశక్తి పాయింట్ దగ్గర సాయంకాలం ప్రారంభమై, వెలుగులు క్రమంగా తగ్గుతుండటంతో
శాస్త్రవేత్తలు వాటిని నిద్రాణస్థితిలోకి పంపారు.
14
రోజుల తర్వాత మైనస్ డిగ్రీల ఉష్ణోగ్రతను తట్టుకుని విక్రమ్, ప్రజ్ఞాన్ పనిచేస్తే అది
అద్భుతం అవుతుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఈ నెల 22న శివశక్తి పాయింట్ దగ్గర
సూర్యోదయం అవుతుంది. అప్పుడు మళ్ళీ సూర్యకాంతి ద్వారా చార్జ్ అయ్యేలా ఏర్పాట్లు
చేశారు.
సూర్యోదయం తర్వాత దానిని తిరిగి
యాక్టివేట్ చేసేందుకు ప్రయత్నిస్తామన్న ఇస్రో.. ఒకవేళ విఫలమైతే ఆ రెండూ మనదేశ
గుర్తులుగా జాబిల్లిపై నిలిచిపోతాయన్నారు.
ప్రజ్ఞాన్ రోవర్, ల్యాండర్
నుంచి ఇప్పటి వరకు 100 మీటర్ల దూరం ప్రయాణించినట్లు ఇస్రో వెల్లడించింది. రోవర్
ప్రయాణించిన మార్గానికి సంబంధించిన ఫొటోను ట్విటర్ లో పోస్టు చేసింది. ప్రజ్ఞాన్
రోవర్ సెంచరీ కొట్టినట్లు సోషల్ మీడియాలో తెలిపింది.