సోమవారం నాటికి బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశాలున్నాయని భారత వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఇప్పటికే బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. దీని ప్రభావంతో రాబోయే రెండు రోజులపాటు తెలంగాణ, ఏపీలో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. విదర్భ నుంచి కర్ణాటక వరకు ద్రోణి కొనసాగుతోందని వాతావరణ శాఖ వెల్లడించింది. దీని ప్రభావంతో శనివారం తెలంగాణలోని చాలా జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిశాయి.
పిడుగులు పడి ముగ్గురు మృతి
తెలంగాణలో శనివారం భారీ వర్షాలకుతోడు అనేక చోట్ల పిడుగులు పడ్డాయి. వీటి కారణంగా ముగ్గురు చనిపోయారు. కుమురం భీం జిల్లా బెజ్జూరు మండలం పోతపల్లి గ్రామానికి చెందిన తొడిశం పోసక్క పొలంలో పనులు చేసుకుంటున్న సమయంలో పిడుగుపడి అక్కడికక్కడే చనిపోయారు. మంచిర్యాల జిల్లా భీమారంలో బండారి లింగయ్య అనే వ్యక్తిపై పిడుగు పడటంతో మృతిచెందాడు. కరీంనగర్ జిల్లా చొప్పదండి మండలం కోనేరుపల్లిలో కొమురమ్మ అనే మహిళ పొలంలో వ్యవసాయ పనులు చేస్తుండగా పిడుగుపడి చనిపోయింది.
పగలంతా ఎండలు ఉక్కపోత
తెలుగు రాష్ట్రాల్లో ఎండలు ఇరగదీస్తున్నాయి. సాధారణం కన్నా 3 నుంచి 5 డిగ్రీల ఉష్ణోగ్రతలు అధికంగా నమోదవుతున్నాయి. ఏపీ, తెలంగాణలో అనేక జిల్లాల్లో 35 నుంచి 39 డిగ్రీల ఉష్ణోగ్రతలు రికార్డవుతున్నాయి. ఆవర్తనం ప్రభావంతో హైదరాబాదులో శనివారం అర్థరాత్రి నుంచి జోరువానలు కురుస్తున్నాయి. ఏపీలోనూ పలు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు నమోదయ్యాయి. సోమవారం నాటికి ఆవర్తనం అల్పపీడనంగా మారి భారీ వర్షాలు కురుస్తాయని అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది.