ఒడిషా రైలు ప్రమాద ఘటనలో సీబీఐ, ముగ్గురు రైల్వే
ఉద్యోగులపై సీబీఐ స్పెషల్ కోర్టులో ఛార్జిషీట్ దాఖలు చేసింది. ఆ ప్రమాదంలో 296 మంది చనిపోయారు,
1200 మందికిపైగా గాయపడ్డారు.
ఒడిషాలోని బాలాసోర్ జిల్లా బహానగా రైల్వేస్టేషన్
సమీపంలో రైలు ప్రమాద ఘటనను సీబీఐ దర్యాప్తు చేస్తోంది. దానిలో భాగంగా ముగ్గురు
ఉద్యోగుల మీద స్పెషల్ కోర్టులో అభియోగాలు మోపింది. రైల్వే చట్టంలోని 153
సెక్షన్‌తోపాటు సాక్ష్యాలను నాశనం చేసేందుకు యత్నించడం, హత్యతో
సమానమైన నేరాభియోగాలు మోపింది. రైలు ప్రమాదంలో కుట్ర కోణం ఉందన్న అనుమానాల
నేపథ్యంలో కేసును సీబీఐకి అప్పగించారు. జులై 7న
సీనియర్ సెక్షన్ ఇంజినీర్ అరుణ్‌కుమార్ మహంత, సెక్షన్
ఇంజినీర్ అమీర్ ఖాన్, టెక్నిషియన్ పప్పు కుమార్‌లను అరెస్టు చేసింది.
‘బహానగా స్టేషన్ సమీపంలో ప్రమాదం జరిగిన 94వ
లెవెల్ క్రాసింగ్ గేట్ వద్ద మరమ్మతు పనులు మహంత సమక్షంలోనే జరిగాయి. కానీ,
ఆ పనులకు 79వ లెవెల్ క్రాసింగ్ గేట్‌కు సంబంధించిన
సర్క్యూట్ డయాగ్రమ్నే ఉపయోగించారు’ అని సీబీఐ పేర్కొంది. ‘ఇప్పటికే ఉన్న సిగ్నల్,
ఇంటర్‌లాకింగ్ వ్యవస్థలను పరీక్షించడం, మరమ్మతులు
చేపట్టడం, మార్పులు చేయడం.. ఆమోదిత ప్రణాళిక, సూచనలకు
అనుగుణంగా ఉన్నాయా లేవా అని నిర్ధారించుకోవడం మహంత విధి. ఆయన తన విధిని విస్మరించారు’
అని తెలిపింది.
జూన్ 2న బాలేశ్వర్ జిల్లా బహానగా స్టేషన్
వద్ద లూప్లైన్లో ఆగిఉన్న గూడ్సు రైలును కోరమాండల్ సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్
ఢీకొంది. ఆ తీవ్రతకు కోరమాండల్‌లోని కొన్ని బోగీలు పక్కనున్న ట్రాకుపై పడ్డాయి. అప్పటికే
ఆ మార్గంలో వెళ్తోన్న బెంగళూరు-హావ్‌డా సూపర్‌ఫాస్ట్ రైలులోని కొన్ని బోగీలు
పట్టాలు తప్పాయి. అనుమతులు లేని మరమ్మతులు చేపట్టడమే ఈ ఘటనకు దారితీసిందని సీబీఐ
ఇదివరకే వెల్లడించింది.
రాహుల్ గాంధీకి యూపీ కోర్టు సమన్లు