రాజస్థాన్‌లో గురువారం అవమానకర ఘటన జరిగింది. ఒక
గిరిజన మహిళను ఆమె భర్త చితకబాది, ఆమెను వివస్త్రను చేసి, ఊరంతా నగ్నంగా ఊరేగించిన
దుర్ఘటన సభ్య ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురి చేసింది. ఆ అవమానకర సంఘటనను కొందరు
వీడియో తీయడంతో ఈ దుష్కృత్యం బైటపడింది.
రాజస్థాన్ పోలీసులు ఈ కేసు వివరాలు ఇలా
తెలియజేసారు. ప్రతాప్‌గఢ్ జిల్లాలోని ఒక గ్రామంలో 21ఏళ్ళ గిరిజన యువతికి ఒక
వ్యక్తితో వివాహేతర సంబంధం ఉంది. ఈమధ్య ఆ యువకుడితో కలిసి ఆమె సహజీవనం చేయడం
ప్రారంభించింది. దాంతో ఆమె భర్త, అత్తమామలు ఆగ్రహించారు. ఆమెను కిడ్నాప్ చేసి తమ
గ్రామానికి తీసుకొచ్చారు. ఆమెను చితకబాదారు. తర్వాత ఆమె భర్త ఆమె దుస్తులు
తొలగించి, గ్రామవీధుల్లో నగ్నంగా ఊరేగించారు. ఆ దాడినంతటినీ స్థానికులు వీడియో
తీసి వైరల్ చేసారు.
ఈ కేసుకు సంబంధించి ఆమె భర్తతో పాటు మొత్తం ఏడుగురిని
అరెస్ట్ చేసినట్టు పోలీస్ అధికారులు వెల్లడించారు. ఈ కేసు రాజస్థాన్‌లో రాజకీయ
ప్రకంపనలు సృష్టిస్తోంది. ముఖ్యమంత్రి అశోక్ గెహ్లోత్‌పై ప్రతిపక్ష బీజేపీ
విరుచుకుపడింది. అయితే ఆయన ఈ సాయంత్రం ప్రతాప్‌గఢ్ జిల్లాలో బాధిత మహిళను, ఆమె
కుటుంబ సభ్యులను కలుసుకుంటానని ప్రకటించారు.
ధరియావాద్ అసెంబ్లీ కాంగ్రెస్ ఎమ్మెల్యే నాగరాజ్
మీనా మాట్లాడుతూ తనకు ఈ విషయం శుక్రవారం రాత్రి 9 గంటలకు తెలిసిందని, వెంటనే
జిల్లా కలెక్టర్, ఎస్పీలతో మాట్లాడానని చెప్పారు. ’’ఇది చాలా దారుణం, ఇలాంటి ఘటనలు
జరగనే కూడదు. ఈ ఘటనను ఖండించడానికి మాటలు సరిపోవు. పోలీసులు తక్షణం చర్యలు
తీసుకుంటారు’’ అని చెప్పారు.
కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో మహిళల భద్రతకు ముప్పు
వాటిల్లిందని బీజేపీ విరుచుకుపడింది. ‘‘పాలక కాంగ్రెస్ ముఠాభేదాల్లో కూరుకునిపోయి
ఉంది. వర్గాల మధ్య గొడవలను పరిష్కరించుకోడంలో తీరిక లేకుండా ఉంది. మిగిలిన కాస్త
సమయమూ ఢిల్లీలో ఒక వంశానికి సంతుష్టి కలిగించడంలోనే సరిపోతోంది. ఈ రాష్ట్ర
ప్రభుత్వానికి రాజస్థాన్ ప్రజలు త్వరలోనే బుద్ధి చెబుతారు’’ అని, బీజేపీ జాతీయ
అధ్యక్షుడు జేపీ నడ్డా వ్యాఖ్యానించారు.
అంతకుముందు, బీజేపీ నాయకుడు గజేంద్రసింగ్
షెకావత్, ఆ దుర్ఘటన తాలూకు వైరల్ వీడియోని ట్వీట్ చేస్తూ, ఈ ఘటన కాంగ్రెస్
కపటత్వాన్ని కళ్ళకు కడుతోందన్నారు. రాష్ట్రంలో శాంతిభద్రతల పరిస్థితి దిగజారిందని
మండిపడ్డారు. మణిపూర్ ఘటన మీద కాంగ్రెస్ నేతలు, రాహుల్ గాంధీ వ్యాఖ్యలను గుర్తుచేస్తూ…
ఈ ఘటన తర్వాత రాహుల్ గాంధీ అశోక్ గెహ్లోత్‌తో రాజీనామా చేయిస్తారా, రాష్ట్రంలో
రాష్ట్రపతి పాలన కావాలని అడుగుతారా? అని ప్రశ్నించారు.
‘‘రాజస్థాన్‌లో మహిళలపై దాడుల్లో అన్ని పరిమితులూ
చెరిగిపోయాయి. ధరియవాద్‌లో ఒక మహిళను వివస్త్రను చేసి చితకబాదారు. ఆ వీడియో వైరల్
కూడా అయింది. మహిళా భద్రత గురించి భారీ ఉపన్యాసాలు దంచే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి అశోక్
గెహ్లోత్‌జీయే, రాష్ట్ర హోంమంత్రి కూడా. ఘటన జరిగి రెండు రోజులు గడిచిపోయాయి. ఇప్పటివరకూ
పోలీసులు కనీసం రిపోర్ట్ ఐనా తయారుచేయలేదు. కాంగ్రెస్కపటత్వం
బట్టబయలైంది. రాహుల్ గాంధీ ఎక్కడ? ధరియవాద్ ఎప్పుడు వస్తున్నారు? అశోక్ గెహ్లోత్
రాజీనామా చేయాలని ఎప్పుడు అడుగుతారు? రాజస్థాన్‌లో రాష్ట్రపతి పాలన విధించాలని
ఎప్పుడు డిమాండ్ చేస్తారు?’’ అంటూ షెకావత్ ట్వీట్ చేసారు.
రాహుల్ గాంధీకి యూపీ కోర్టు సమన్లు