సూర్యుడి
గురించి పరిశోధన కోసం ఇస్రో చేపట్టిన ఆదిత్య ఎల్-1 లాంచింగ్ విజయవంతమైంది. శ్రీహరికోట
నుంచి నింగిలోకి దూసుకెళ్ళిన పీఎస్ఎల్వీ-57 రాకెట్ ఆదిత్య ఎల్-1 ఆర్బిటర్ ను నిర్దేశిత కక్ష్యలోకి చేర్చింది.
భారీ విజయంతో శాస్త్రవేత్తలు సంబరాలు చేసుకుంటున్నారు. అసమానవిజయం సాధించారంటూ
ఇస్రో సిబ్బందికి ప్రముఖులు శుభాకాంక్షలు తెలిపారు.
ఇస్రో
ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఆదిత్య ఎల్-1 లాంచింగ్ విజయవంతం కావడం చిరస్మరణీయమని
రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు. ప్రాజెక్టులో భాగస్వాములైన ప్రతీఒక్కరిని
అభినందించారు. అంతరిక్షాన్ని మరింత అర్థం చేసుకునేందుకు ఈ మిషన్ దోహదపడుతుందని
ఆశాభావం వ్యక్తం చేశారు.
ప్రయోగంలో భాగస్వాములైన ఇంజినీర్లు,
శాస్త్రవేత్తలకు ప్రధాని నరేంద్రమోదీ శుభాకాంక్షలు తెలిపారు. చంద్రయాన్ -3 విజయం
సాధించినప్పటి నుంచి అంతరిక్షంలో భారత జైత్రయాత్ర
కొనసాగుతోందన్నారు. శాస్త్రవేత్తల నిరంతర కృషి కారణంగానే ఈ ఘనత సాధ్యమైందని
కొనియాడిన ప్రధాని… వారి కృషి విశ్వమానవ సంక్షేమానికి ఉపకరిస్తోందని
చెప్పారు.
కేంద్ర
హోంమంత్రి అమిత్ షా కూడా ఇస్రో సిబ్బంది కృషిని కొనియాడారు. ఆదిత్య ఎల్ 1 లాంచింగ్
విజయవంతం అయ్యేందుకు శ్రమించిన ప్రతిఒక్కరికి హృదయపూర్వక అభినందనలు తెలిపారు. ఈ
అసమాన విజయంతో భారత్ గొప్ప పురోగతి సాధించిందన్నారు. అంతరిక్ష రంగంలో ఆత్మనిర్భర్
భారత్ కు సంబంధించిన ప్రధాన మంత్రి దార్శనికతను నెరవేర్చే దిశగా ఇస్రో కృషి
చేస్తోందని ప్రశంసించారు.
ఇస్రో
తాజాగా సాధించిన విజయంతో మరోసారి కీర్తిబావుటా ఎగరవేసిందని కేంద్రమంత్రి జితేంద్ర
సింగ్ అన్నారు. ఈ భారీ ప్రయోగ ప్రారంభ క్షణాల కోసం దేశం మొత్తం ఊపిరి బిగబట్టుకుని
ఎదురు చూసిందన్నారు.